Karimnagar | ముకరంపుర, సెప్టెంబర్ 19 : నిజామాబాద్ లో ఈ నెల 17 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించిన టీజీ ట్రాన్స్ కో, డిస్కమ్స్ రాష్ట్రస్థాయి ఇంటర్ సర్కిల్ పోటీల్లో కరీంనగర్ క్రీడాకారులు సత్తా చాటారు. బాస్కెట్‌బాల్ పోటీల్లో ఛాంపియన్ షిప్ కైవసం చేసుకోగా టేబుల్ టెన్నిస్ లో తృతీయ స్థానం సాధించారు. బాస్కెట్‌బాల్ జట్టు కెప్టెన్ ఈఎల్పీ రాజు టోర్నమెంట్లో చాకచక్యంగా ఆట తీరును ప్రదర్శించారు. జట్టు సభ్యులు విశ్వతేజ, వినీత్, మేఘనాథ్, రమేష్, సుధీర్ కుమార్, రంగు వెంకటనారాయణ, వినీల్, ప్రశాంత్, మొయిన్ పాషాను సమన్వయం చేస్తూ అద్భుతమైన ఆట తీరుతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
ఫైనల్ పోటీల్లో కరీంనగర్ టీం ఖమ్మం జట్టుపై 45–20 స్కోరుతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. టేబుల్ టెన్నిస్ విభాగంలో కరీంనగర్ జట్టు తృతీయ స్థానాన్ని సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచే కరీంనగర్ బాస్కెట్ బాల్ బృందానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, 15 ఏళ్లు గా జట్టు ప్రతీ పొటీలోనూ విజయం సాధించడం గర్వకారణమని జట్టు మేనేజర్, సీనియర్ క్రీడాకారుడు జీ రాజ్‌కుమార్ పేర్కొన్నారు. క్రీడాకారుల క్రమశిక్షణ, సమష్టి కృషి, పట్టుదల, అంకితభావమే జట్టు విజయానికి మూలమని కొనియాడారు. ఈ సందర్భంగా బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ జట్లను కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి సర్కిళ్ల ఎస్ఈలు అభినందించారు. భవిష్యత్‌లో జాతీయ స్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.