గంగాధర, జూన్1: ‘బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బడా ఝూటా పార్టీ’ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిప్పులు చెరిగారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం.. ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చడమే వారి పని అని దుయ్యబట్టారు. అడ్డదారుల్లో గద్దెనెక్కడమే బీజేపీ విధానమైతే, అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ విధానమని వ్యాఖ్యానించారు. శుక్రవారం మండలంలోని మధురానగర్‌లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌కు వస్తున్న ప్రధానీ మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రులకు తెలంగాణలోని అభివృద్ధిని చూపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు హితవు చెప్పారు. ఇక్కడ అమలవుతున్న కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేస్తున్నారో అడిగి తెలుసుకోవాలన్నారు.
నిరుపేద దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర సర్కారు దళితబంధును తెచ్చిందని, బీజేపీ నేతలకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఈ స్కీంను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సవాల్ విసిరారు. కరువుతో అల్లాడిన నేలను కాళేశ్వరం ప్రాజెక్టుతో పునీతం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇలాంటి ప్రాజెక్టును ఏ ఒక్కటైనా నిర్మించారో చెప్పాలన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన తెలిపిన రైతులను చంపిన నర హంతక పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 10 తెలంగాణకు వస్తే బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక్క అవార్డు రాకపోవడానికి కారణమేమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, కొండగట్టు బోర్డు డైరెక్టర్ ఉప్పుల గంగాధర్, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు వేముల లావణ్య, మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్‌రెడ్డి, జోగు లక్ష్మీరా జం, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు వేముల అంజి, రామిడి సురేందర్, వడ్లూరి ఆదిమల్లు, ఆకుల మధుసూదన్, లింగాల దుర్గ య్య, ఎగుర్ల మల్లయ్య, దోమకొండ మల్లయ్య, సముద్రాల అజేయ్, గంగాధర కుమార్, పెంచాల చందు, మ్యాక వినోద్, మామిడిపెల్లి అఖిల్, సముద్రాల ఓంకార్, గంగాధర వేణు, తూము తిరుపతి, నగేశ్, నరేశ్, రఘు, సంజీవ్, రవి, లచ్చయ్య, మహేశ్, తిరుపతి పాల్గొన్నారు.