కోరుట్ల, ఏప్రిల్ 8: కోరుట్లలోని శ్రీనివాస రోడ్డు ప్రాంతానికి చెందిన గోనెల శ్రీకాంత్ డిగ్రీ వరకు చదివాడు. ఇనుప, ప్లాస్టిక్ కూలర్లు, ఇతర విద్యుత్ పరికరాల విక్రయ దుకాణాన్ని నడుపుతున్నాడు. చిన్నప్పటి నుంచే ప్రయోగాలంటే ఇష్టపడే శ్రీకాంత్, మినీ కూలర్ తయారుచేయాలనుకున్నాడు. 15 కిలోల ఖాళీ వంట నూనె డబ్బాను ఎంచుకున్నాడు. ముందుగా ఆ డబ్బాకు కింది భాగంలో రెండు లీటర్ల నీరు పట్టేలా గ్యాప్ ఉంచి పైన ఫ్యాన్ సపోర్టింగ్ కోసం ప్లాస్టిక్‌తో తయారు చేసిన పరికరాన్ని అమర్చాడు. దానిపై ఫ్యాన్ రిక్కలు, చిన్న మోటర్, కండెన్సర్ ఏర్పాటు చేశాడు. డబ్బాకు ఇరువైపులా చల్లని గాలి వీచే విధంగా గడ్డితో అల్లిన జాలీలను అమర్చాడు. మోటరు పైపుల ద్వారా గడ్డిపై నీరు లోనికి బయటకు వెళ్లేలా రూపొందించాడు. కరెంట్ వైర్ కనెక్షన్ ఇచ్చాడు. ఇంకేముంది కూలర్ రెడీ అయింది. మినీ కూలర్‌ను బయటకు ఈజీగా తీసుకువెళ్లేందుకు పైభాగాన హ్యాండిల్ ఏర్పాటు చేశాడు. దీనికి 700 దాకా ఖర్చయిందని, అంతే ధరకు విక్రయిస్తున్నట్లు శ్రీకాంత్ చెబుతున్నాడు. 12 ఇంచుల పొడువు, 9 ఇంచుల వెడల్పు ఉన్న ఈ మినీ కూలర్ చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నది.