Peddapally | పెద్దపల్లి రూరల్, మార్చి 14 : విద్యార్థుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాల వికాసానికి కరాటే శిక్షణ దోహదం చేస్తుందని పాఠశాల కరస్పాండెంట్ చిప్ప భాస్కర్ అన్నారు. పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని శ్రీ ఆదర్శ పాఠశాలలో బీఎంఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు.
ఈ గ్రేడింగ్ టెస్ట్‌లో సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని, క్రమశిక్షణతో చేసిన ప్రదర్శనల ద్వారా విద్యార్థులు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ బెల్ట్‌లు సాధించి గురువుల ప్రశంసలు అందుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఎగ్జామినర్‌గా వరంగల్ కు చెందిన బీఎంఆర్ కరాటే అకాడమీ ఫౌండర్ బండారి సంతోష్ హాజరై విద్యార్థుల ప్రతిభను పరిశీలించి ప్రశంసించారు. డ్రాగన్స్ కుంగుఫూ గ్రాండ్ మాస్టర్ కొండేళ్ల సదానందం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ ప్రాముఖ్యతను వివరించారు.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆత్మరక్షణ కళల్లో కూడా ముందుండాలని సూచించారు. కరాటే శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ధైర్యం, క్రమశిక్షణ, శారీరక ధృడత్వం పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ కర్ర వెంకటేష్ తో పాటు కోచ్ లు వినయ్, శశి, దినేష్, రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషించారు. బెల్ట్‌లు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం వారికి అభినందనులు తెలిపారు.