మెట్పల్లి : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట, నడికుడ గ్రామాల మధ్య సర్వేనెంబర్ 299/2/1 లో అక్రమంగా జారీ చేసిన పట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆ రెండు గ్రామాలకు చెందిన రైతులు బుధవారం మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పశుగ్రాసం కోసం వదిలిన ఈ స్థలాన్ని నడికుడకు చెందిన నర్సారెడ్డి అనే వ్యక్తి డి వన్ పేరిట అక్రమంగా పట్టా పొందడమే కాకుండా అక్రమంగా భూ రీ సర్వే చేపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే అక్రమ పట్టాలను రద్దు చేయడంతో పాటు భూమి రీ సర్వేను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాఘవపేట, నడికుడ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.