ఇటీవలి కాలంలో న్యూట్రీషియన్ కోర్సుకు ఆదరణ పెరుగుతున్నది. శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని పలు కాలేజీల్లో ఈ మూడేళ్ల ఈ డిగ్రీని అందిస్తుండగా, విద్యార్థుల నుంచి ఆసక్తి కనిపిస్తున్నది. చేరిన విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జి కోసం హైదరాబాద్‌కు చెందిన పలు ఉన్నత శ్రేణి దవాఖానల్లో ఇంటర్న్‌షిప్ చేయిస్తున్నారు. ఈ కోర్సుతో భవిష్యత్తులో మంచి ఉద్యోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 20 : ప్రస్తుత పరిస్థితుల్లో న్యూట్రీషియనిస్టులకు డిమాండ్ పెరిగింది. ఆరోగ్యంపై అవగాహన కోసం పలువురు న్యూట్రీషియనిస్టుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పలు రకాల వ్యాధిన పడ్డ బాధితులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం కార్పొరేట్ దవాఖానల్లో ప్రత్యేకంగా న్యూట్రిషియనిస్టులను నియమిస్తున్నారు. వారి సూచన మేరకు రోగులకు పోషకారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో న్యూట్రీషియన్ కోర్సుకు కూడా డిమాండ్ పెరిగింది. పాఠశాలలు, ఉన్నత శ్రేణి దవాఖానలు, ఉన్నత శ్రేణి కుటుంబాలు, వ్యాధిగ్రస్తులు ప్రత్యేకంగా న్యూట్రీషియనిస్టులను నియమించుకుంటుండంతోపాటు ఉద్యోగావకాశాలు కూడా మెరుగ్గా ఉండడంతో ఈ కోర్సుకు ఆదరణ పెరిగింది.
న్యూట్రీషియన్స్ ఏం చేస్తారంటే..
న్యూట్రీషియన్లు దవాఖానల్లో ఉన్న రోగులతో పాటు, డైట్లో ఉన్న వారికి, బరువు తగ్గాలనుకునేవారికి, పెరగాలనుకునే వారికి ఇలా పోషకాహారం, ఆహారం, ఆరోగ్యం గురించి వివరిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాఠశాలలు, హాస్పిటల్స్, ఉన్నత శ్రేణి కుటుంబాలు, దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పలువురు ప్రత్యేకంగా న్యూట్రీషియన్లును నియమించుకుని తమ ఆరోగ్య అవసరాలు తీర్చుకుంటున్నారు. అందులో భాగంగా నగరంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోని కేర్, కిమ్స్ లాంటి కార్పొరేట్ దవాఖానల్లో ఈ కోర్సులో ఇంటర్న్‌షిప్ చేస్తూ విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో ఒక రోగితో మమేకమై వారు ఎలాంటి ఆహారం తీసుకుంటే కుదుటపడతారు. ఈ రోగానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అంశాలను నేర్చుకుంటున్నారు. అయితే, ఇలాంటి అవకాశాలు రావడం గొప్ప విషయమని, ప్రాక్టికల్ నాలెడ్స్తో కొంత మేర అనుభవం వస్తుందని విద్యార్థులు పేర్కొంటున్నారు.
నాణ్యమైన విద్యను అందిస్తున్నాం
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందులో భాగంగానే ఇలాంటి కోర్సులలో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేయిస్తున్నాం. అందుకోసం ఆయా దవాఖానల యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులను పంపిచాం. విద్యార్థులకు తరగతి గదిలో ఎంత నేర్చుకుంటారో, ప్రాక్టికల్‌గా ఒక పేషెంట్‌తో అంత నేర్చుకుంటారు. అలాంటి విద్యతో నాణ్యత ఉంటుంది.
– ముద్దసాని రమేశ్ రెడ్డి, చైర్మన్ (శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల) నమ్మకం పెంచుతున్నాం
విద్యార్థులు మూస పద్ధతుల్లో కాకుండా ఒక కొత్త విద్యను నేర్చుకుంటే వారివారి వ్యక్తిగత జీవితాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు వారిపై వారికి నమ్మకం పెంచేలా కళాశాల చైర్మన్ ఆధ్వర్యంలో ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించాం. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్క న్యూట్రీషియన్ కోర్సులో కాకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరమైన అన్ని కోర్సులలో ఈ విధానం అవలంబిస్తాం.
– ఎల్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ (శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కళాశాల)
ఉజ్వల భవిష్యత్తు
న్యూట్రీషయన్ కోర్సుతో ఉజ్వల భవిష్యత్తు ఉంది. డిగ్రీ ద్వారా మా దగ్గరికి వచ్చే విద్యార్థులకు రోగులతో మమేకమై పని చేసేలా పలు సూచనలు చేస్తున్నాం. ఏ రోగికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి?, ఆరోగ్యంగా ఉన్న వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?, అనే అంశాలను నేర్పిస్తున్నాం. భవిష్యత్తులో విద్యార్థులు దవాఖానలు, జిమ్ సెంటర్లు, ప్రైవేటుగా ఇలా న్యూట్రీషియనిస్టులుగా సేవలందించవచ్చు. ఇలాంటి విద్య డిగ్రీ, పీజీ ద్వారా అందించడం మంచి అవకాశం. కళాశాల నిర్వాహకులు సైతం ఇంటర్న్‌షిప్ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌కు విద్యార్థులను పంపి వారికి ప్రాక్టికల్‌తో కూడిన విద్య అందిస్తున్నారు. ఇలాంటి కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ రాధిక, కిమ్స్, హెచ్‌వోడీ
ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం న్యూట్రీషన్ డిగ్రీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం. కేర్ లాంటి ఉన్నత శ్రేణి హాస్పిటల్ నిర్వాహకులతో మాట్లాడి మా కాలేజీ నుంచి ఇంటర్న్‌షిప్‌కు పంపిస్తున్నారు. దీని వల్ల తరగతిలో నేర్చుకున్నదానికంటే ఇక్కడే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి. మేం చాలా హ్యాపీ.
– శ్రీమహేశ్వరి, డిగ్రీ విద్యార్థిని (శ్రీచైతన్య డిగ్రీ కళాశాల)
మాకు మంచి ఎక్స్పీరియన్స్
కిమ్స్ లాంటి దవాఖానలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్‌తో మమేకమై పని చేసే అవకాశం మా కాలేజీ యాజమాన్యం మాకు కల్పించింది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక పేషెంట్ ఏం తినాలి? ఎంత మోతాదులో తినాలి? అలా ఎన్ని రోజుల వరకు పాటించాలి? ఇలా చాలా అంశాల గురించి వివరిస్తున్నాం. ఇది మాకు మంచి ఎక్సీపిరియన్స్.
– భార్గవి, డిగ్రీ విద్యార్థిని (శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల)