తిమ్మాపూర్, జూలై 15 : గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారణమైన నీ అనుచరుడు మురళీధర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. షాడో ఎమ్మెల్యే మురళీ అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలతో ఆర్తనాదాలు చేస్తున్న బాధితుడిపైనే ఆరోపణలు చేస్తవా? అని ఆగ్రహించారు. ఆయనకు ఏమైనా జరిగితే నువ్వే బాధ్యత వహించాలని అల్టిమేటం జారీ చేశారు.
ఈ మేరకు బుధవారం ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. షాడో ఎమ్మెల్యే అరాచకాలు భరించలేక ఎమ్మెల్యేకు చెప్పుకుందామని రాజేందర్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌కు వస్తే.. నీవు కూడా పట్టించుకోకపోతే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆవేదన చెందారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే పరామర్శించాల్సింది పోయి.. రాజేందర్‌రెడ్డికి ఏం కాలేదని మాట్లాడడం సిగ్గుగా ఉందని మండిపడ్డారు. ఒక డాక్టర్, ఎమ్మెల్యే అయి ఉండి ఇలా మాట్లాడుతవా అని విరుచుకుపడ్డారు.
ఆయన భార్య సర్పంచిగా ఉన్నప్పుడు గుండ్లపల్లి అద్భుతంగా చేసిన రాజేందర్ రెడ్డిని నీ అనుచురుడి కోసం బ్లాక్మెయిల్, తాగుబోతు, దొంగ అని మాట్లాడుతావా..? అని ఆగ్రహించారు. ఇయాళ నీ మనిషిని వెనుకేసుకురావడం కోసం దవాఖానలో ఆర్తనాదాలు చేస్తున్న మనిషి చూసి కూడా ఇలాగేనా మాటాడేది?’ అని ధ్వజమెత్తారు. ‘ఆయన బ్రిక్స్ వద్దకే పోతరు. తాగుతరు. కొడ్తరు. కేసులు పెడుతరు. ఇవన్నీ చేసినా ఇంకా మురళీనే సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తావా?’ అని మండిపడ్డారు. ‘ఆయనకు ఎవరూ లేరనుకోకు. ఆత్మహత్యకు కారణమైన మురళీని అరెస్ట్ చేయించు’ అని డిమాండ్ చేశారు.
విషమంగానే రాజేందర్‌రెడ్డి పరిస్థితి
ఎమ్మెల్యే కవ్వంపల్లి క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసుకున్న గుండ్లపల్లికి చెందిన రాజేందర్‌రెడ్డి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన.. కాలిన గాయాలతో తీవ్ర అవస్థ పడుతున్నాడు. వైద్యులు ఇంకా ఏమీ చెప్పడం లేదని సమాచారం. కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పనున్నారు.