కొత్తపల్లి/జమ్మికుంట, మే 14 : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి క్రీడల సందడి ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం, వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు చీఫ్ మినిస్టర్స్ (సీఎం కప్ -2023) క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) సంయుక్త ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ క్రీడాపోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఈ నెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల సందడి ప్రారంభంకానుంది. సీఎం కప్-2023 పోటీలు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు గొప్ప అవకాశంగా మారనున్నాయి. ఇటీవలే నూతన సెక్రటేరియట్లో సీఎం కప్ టోర్నీ నిర్వహణపై రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తొలి సంతకం చేశారు. అండర్ – 15 ఏళ్ల నుంచి అండర్ – 36 ఏళ్ల పురుష, మహిళా క్రీడాకారులు సీఎం కప్ టోర్నీలో పాల్గొననున్నారు.
అన్ని మండలాల్లో నేటి నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు
కొత్తపల్లి మండలంలో చింతకుంటలోని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాలలో, రామడుగు మండల కేంద్రంలోని లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల, సైదాపూర్ మండలంలోని వీణవంక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, శంకరపట్నం మండలంలోని కేశవపట్నం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, వీణవంక మండల కేంద్రంలోని వీణవంక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, గన్నేరువరం మండల కేంద్రంలోని గన్నేరువరం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, హుజురాబాద్ మండల కేంద్రంలోని హుజురాబాద్ ప్రభుత్వ బాలుర హైస్కూల్లో, జమ్మికుంట మండల కేంద్రంలోని జమ్మికుంట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, కరీంనగర్ రూరల్ మండలంకు సంబంధించిన క్రీడాపోటీలు నగునూర్‌లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల, కరీంనగర్ అర్బన్ పరిధిలో నగరంలోని డా.బిఆర్ అంబేద్కర్ స్టేడియం, , మానకొండూర్ మండల కేంద్రంలోని మానకొండూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, చిగురుమామిడి మండలానికి సంబంధించి చిగురుమామిడిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో, చొప్పదండి మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ బాలుర హైస్కూల్, ఇల్లంతకుంట మండలానికి సంబంధించిన పోటీలు సిరిసేడు జడ్పీహెచ్ఎస్ పాఠశాల, టేకుర్తిలోని టీఎస్ మోడల్ స్కూల్, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఇల్లంతకుంట కేజీవీబీ పాఠశాలలో, గంగాధర మండల కేంద్రంలోని గంగాధర జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలను ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు.
మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు
-మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో సీఎం కప్ క్రీడాటోర్నీల నిర్వహణ చేపట్టనున్నారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో పురుష, మహిళా క్రీడాకారులకు మండలస్థాయి సీఎం కప్ టోర్నీలు నిర్వహించనున్నారు. మండల స్థాయిలో స్త్రీ, పురుషులకు అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించనుండగా జిల్లా స్థాయి లో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్ పోటీలను నిర్వహించనుండగా రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మిం గ్, రెజ్లింగ్, అర్చరీ, జిమ్నాస్టిక్స్, హాకీ, లాన్ టెన్ని స్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించనున్నారు. మండలస్థాయిలో సీఎ కప్ పోటీల నిర్వహణ కోసం కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఎంపీపీ చై ర్మన్‌గా, ఎంపీడీఓ మెంబర్ కన్వీనర్‌గా, జడ్పీటీ సీ, తహసీల్దార్, ఎంఈవో లేదా గెజిటెడ్ హెచ్ ఎం, ఎస్ఐ, మున్సిపల్ ఏరియాలో కమిషనర్, పీడీ లేదా పీఈటీ సభ్యులుగా ఉంటారు. మండలస్థాయిలో విజేత జట్లకు జిల్లాస్థాయి పోటీలకు పంపుతారు.
జిల్లాస్థాయిలో 11 క్రీడాంశాల్లో పోటీలు
జిల్లాస్థాయిలో 11 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పురుష, మహిళలకు అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాసెట్ బాల్, హ్యాండ్ బాల్, స్విమ్మింగ్ తోపాటు పురుషులకు బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాస్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీల నిర్వహణ కోసం కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్ చైర్మన్ గా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) కో-వైస్ చైర్మన్‌గా, డీవైఎస్ఓ కన్వీనర్‌గా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లేదా కార్యదర్శి, జిల్లా విద్యాశాఖాధికారి, జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్, మున్సిపల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయి గెలుపొందిన జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. రాష్ట్రస్థాయిలో ఈనెల 28 నుంచి 31 వరకు 18 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
విజేతలకు ప్రోత్సాహకంగా నగదు బహుమతి, సర్టిఫికెట్ల ప్రదానం
మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యక్తిగత విభాగంతో పాటు టీంల వారీగా పలు క్రీడా పోటీలను సీఎం కప్‌లో నిర్వహించనున్నారు. మొదటి, రెండవ, మూడో స్థానంలో నిలిచిన క్రీడాకారులకు ప్రొత్సాహకంగా నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లను అందజేయనున్నారు. వ్యక్తిగత విభాగంలో మొదటిస్థానంలో నిలిచిన వారికి రూ. 20వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 15వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ. 10వేలను అందించనున్నారు. అలాగే టీం విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. లక్ష, రెండవ స్థానంలో నిలిచిన వారికి రూ. 75వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 50వేలను అందించనున్నారు.
గ్రామీణ క్రీడాకారులకు వరంలాంటివి
మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సీఎం కప్-2023 పోటీలు గ్రామీణ క్రీడాకారులకు ఒక వరంలాంటివి. గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు చక్కటి వేదికగా మారనున్నాయి. పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవసరమైన నిధులను విడుదల చేసింది. కొత్తపల్లి మండలానికి సంబంధించిన క్రీడాపోటీలు చింతకుంట గ్రామంలోని జడ్పీహెచ్ఎఎస్ పాఠశాలలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. క్రీడాకారులు సైతం పోటీల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు.
-పిల్లి శ్రీలత మహేశ్ గౌడ్, ఎంపీపీ కొత్తపల్లి, మండల స్థాయి పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్
పారదర్శకంగా పోటీల నిర్వహణ
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీలు పూర్తి పారదర్శకంగా సాగనున్నాయి. ఈనెల 15 నుంచి 17 వరకు మండలస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని మండలాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల స్థాయితో పాటు, జిల్లా స్థాయి పోటీలు మండలంతో పాటు జిల్లా కేంద్రాల్లో నిర్వహించాల్సి ఉండగా రాష్ట్రస్థాయి పోటీలను హైదరాబాద్‌లో జరుగనున్నాయి. జిల్లాలో 15 మండలాలు, కార్పోరేషన్లో క్రీడలు నిర్వహిస్తన్నం. అర్హులందరూ పాల్గొనాలి. యువతకు మంచి అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్లకు మండలం నుంచి నాలుగు టీం(280మంది)లు, ప్రతి మండలం నుంచి యువతీ, యువకులు 30మంది(వ్యక్తిగతంగా 480మంది) పేర్లు వచ్చాయి. మండల స్థాయిలో 5, జిల్లా స్థాయిలో మే 22 నుంచి 24 వరకు 11 క్రీడలు, రాష్ట్రస్థాయిలో 28 నుంచి 31 వరకు 18 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి.
-కీర్తి రాజవీరు, జిల్లా యువజన, క్రీడాశాఖాధికారి
పీడీ, పీఈటీల భాగస్వామ్యం అభినందనీయం
మండలస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పీడీలు, పీఈటీలను భాగస్వామ్యం చేయడం అభినందనీయం, క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పీడీ, పీఈటీల భాగస్వామ్యం ఎంతో ఉంటుంది. మండల స్థాయి పోటీల నిర్వహణలో పీడీ, పీఈటీలు సభ్యుడిగా వ్యవహరించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికితీసేందుకు సీఎం కప్-2023 పోటీలు దోహదం చేస్తాయి.
– కొమురోజు కృష్ణ, పీడీ