Murder | మంథని రూరల్, మే 10 : రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది. ఏప్రిల్ 30న వంశీ కనబడకుండా పోవడంతో మూడు నాలుగు రోజుల తర్వాత అతని కుటుంబ సభ్యులు గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా హైదరాబాద్ కు సంబంధించిన ఒక యువతి ని కలవడానికి వెళ్ళినట్లు గుర్తించిన పోలీసులు ఆ యువతిని అతని భర్తను తీసుకొచ్చి విచారణ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
లవ్ ఎఫైరే హత్యకు కారణమా?
సింగిరెడ్డిపల్లికి చెందిన వంశీ అదే గ్రామానికి చెందిన ఒక యువతి తో ప్రేమ వ్యవహారం నడిపాడు. తర్వాత క్రమంలో ఆమె వేరొకరిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఇద్దరి మధ్య బ్రేకప్ అయినట్లు తెలిసింది. కాగా ఇటీవల గ్రామ దేవతల కొలుపు సందర్భంగా తిరిగి గ్రామానికి వచ్చిన యువతితో మళ్లీ అతను చనువుగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. ఇది తెలిసిన ఆ యువతి భర్త చాకచక్యంగా ఆ యువతి తోటే అతన్ని ఏప్రిల్ 30న హైదరాబాద్కు పిలిపించి హత్య చేసి అతని శవాన్ని మంథని సమీపంలోని గాడిదల గండిలో వేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకోవడంతో వంశీ మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమైనట్లు సమాచారం. హత్య జరిగి సుమారు పది రోజులు కావడంతో అతని మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో లభ్యమైంది.