మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 16, 2020 , 00:05:32

‘స్వశక్తి’కి సాయం

‘స్వశక్తి’కి సాయం

  • n అతివకు రాష్ట్ర సర్కారు ఆర్థిక చేయూత
  • n కరోనా నేపథ్యంలో సంఘాలకు అత్యవసర రుణాలు
  • n ఉమ్మడి జిల్లాలో 5,610 సంఘాలకు..
  • n ఇప్పటికే 30.27 కోట్లు అందజేత
  • n ఈ నెలాఖరుదాకా  అడిగినవారందరికీ..  
  • n విపత్కర పరిస్థితుల్లో ఊరట

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా కొందరు నిరుపేద మహిళలు కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 పేరుతో స్వశక్తి సంఘాలకు రుణాలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా ఒక్కో సభ్యురాలికి 5 వేల రుణం మంజూరు చేస్తున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికే 5,610 మహిళా స్వశక్తి సంఘాలకు 30.27 కోట్లు మంజూరు చేసింది. అందులో కరీంనగర్‌ జిల్లా పరిధిలోని 2,041 సంఘాలకు 10.91 కోట్లు, జగిత్యాల జిల్లాలోని 1,114 సంఘాలకు 6.15 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 1,504 సంఘాలకు 8.24 కోట్లు, పెద్దపల్లి జిల్లాలోని 951 సంఘాలకు 4.95 కోట్లు ఇప్పటివరకు మంజూరు చేశారు. నేరుగా బ్యాంకుల ద్వారా స్వశక్తి సంఘాలకు ఈ రుణాలు మంజూరు చేస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అడిగిన వెంటనే రుణాలు.. 

స్వశక్తి సంఘాలు అడిగితేనే రుణాలు మంజూ రు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. గతంలో ఇచ్చిన బ్యాంకు లింకేజీ రుణాలతో సం బంధం లేకుండా ఇవి అత్యవసరం కింద అదనంగా ఇస్తున్నారు. ఈ రుణాన్ని వినియోగించుకుని కొందరు కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. మరి కొందరు ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. రుణాలు తిరిగి చెల్లించేందుకు మహిళా సంఘాలే బాధ్యత వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు తీర్మానం చేసి తమ సభ్యులకు రుణాలు అందిస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు కూడా రుణాలు ఇవ్వనుండగా, కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమను ఈ విధంగా ఆదుకుంటున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

బ్యాంకు లింకేజీపై దృష్టి..

బ్యాంకు లింకేజీపైనా అధికారులు దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కు టుంబాలకు వడ్డీ లేకుండా బ్యాంకు లింకేజీ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో లింకేజీ రుణాలు పొందుతున్న మహిళలు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడమే కాకుండా వ్యాపారాలు సాగిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లాలో లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ అందిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10,807 స్వశక్తి సంఘాలకు 239.9 కోట్లు లింకేజీ ద్వారా అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కాగా, జూన్‌ నెల లక్ష్యం 1,436 సంఘాలకు 23 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 3,578 సంఘాలకు 41.03 కోట్ల వరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక సెప్టెంబర్‌ నెలలో 3,532 సంఘాలకు 156.35 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇం దుకు రికార్డుల పరిశీలన జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి కింద 25 కోట్ల రుణాలు ఇవ్వాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్ణయించుకున్నది. ఇప్పటికే 4.60 కోట్లు అందించింది.logo