బుధవారం 20 జనవరి 2021
Jagityal - Nov 25, 2020 , 00:30:47

గ్రేటర్‌ గల్లీల్లో మన లీడర్లు

గ్రేటర్‌ గల్లీల్లో మన లీడర్లు

  • 140, 141వ డివిజన్‌లో మంత్రి ఈటల  
  • 79 వ డివిజన్‌లో మంత్రి గంగుల
  • 137వ డివిజన్‌లో మంత్రి కొప్పుల 
  • 143వ డివిజన్‌లో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ 
  • 136వ డివిజన్‌లో పెద్దపల్లి జడ్పీచైర్మన్‌ మధూకర్‌
  • ఇంటింటా ఓట్ల అభ్యర్థన 
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని వినతి

కార్పొరేషన్‌/ధర్మపురి/ ధర్మారం/గోదావరిఖని: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో మన లీడర్లు తలమునకలవుతున్నారు. ఆయా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. మంగళవారం ఓల్డ్‌ మల్కాజిగిరి నియోజకవర్గంలోని 140, 141వ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నిరుకొండ జగదీశ్‌గౌడ్‌, మేకల సునితాయాదవ్‌ తరఫున కరీంనగర్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయతో కలిసి మంత్రి ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ గద్దెనెక్కితేనే అభివృద్ధి సులభమవుతుందని, అభివృద్ధి నిరోధకులైన ప్రతిపక్షాలకు గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. వందకు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 79వ డివిజన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ వరదసాయం అందించే బాధ్యత తమదేనన్నారు. సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్‌ సమయంలో వేల కోట్లు ఖర్చు చేసి ఉచితంగా బియ్యం పంపిణీ చేశారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హేమలతను గెలిపించాలని కోరారు. 137వ డివిజన్‌ వినాయక్‌నగర్‌లో  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బద్దం పుష్పలత-పరశురామ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలోనే హైదరాబాద్‌ నగరం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో శాంతిభద్రతలకు ఎన్నడూ విఘాతం కలుగలేదన్నారు. నగరంలో శాంతియుత వాతావరణంతో పెట్టుబడులు పోటీపడుతూ తరలివస్తున్నాయన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి, హైదరాబాద్‌ అభివృద్ధికి గానీ ఏనాడూ, ఎలాంటి సాయం చేయలేదని విమర్శించారు. వరద బాధితులకు తెలంగాణ సర్కారు ఇంటింటికీ రూ.10వేలు అందజేస్తుంటే బీజేపీ నాయకులు ఓర్వలేక అడ్డుకున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల కుట్రలు, అవినీతి, అక్రమాలను ఎండగడుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారనీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధించడం ఖాయమని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. 143వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మోతె శ్రీలతశోభన్‌ తరఫున అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుతో కలిసి పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. వివిధ కాలనీల్లో తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నేరెడ్‌మెట్‌ 136వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి తరఫున పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. యప్రాల్‌, మధురానగర్‌కాలనీ, ఒడ్డెర బస్తీలతో పాటు పలు వార్డుల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. గడపగడపకూ వెళ్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి, టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముందుకుసాగారు. ప్రచారంలో ఇక్కడి ప్రజాప్రతినిధులు,టీఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo