Sperm Cell Transplantation | న్యూయార్క్: వంధ్యత్వానికి చెక్ పెట్టే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పెర్మ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడంలో విజయవంతమయ్యారు. అజోస్పెర్మియా (సీమెన్లో స్పెర్మ్ లేకపోవడం)తో బాధపడుతున్న అమెరికాకు చెందిన జైమెన్ హ్సు అనే వ్యక్తికి శాస్త్రవేత్తలు విజయవంతంగా స్పెర్మ్ సెల్‌ను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. తద్వారా అతనికి తండ్రి అయ్యే భాగ్యాన్ని కలిగించారు. పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఈ అద్భుతాన్ని సాధించారు. హార్మోన్ల అసమతుల్యత, హార్మోన్లు సక్రమంగా పనిచేయకపోవడం, పునరుత్పత్తి వ్యవస్థలో అడ్డంకులు, జన్యుపరమైన లోపాల కారణంగా అజోస్పెర్మియా అనే స్థితి తలెత్తుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 1% మంది పురుషులపై ప్రభావం చూపుతున్నది. ఇక జైమెన్ విషయానికి వస్తే.. అతనికి చిన్నతనంలో క్యాన్సర్ సోకగా, కీమోథెరపీ చేశారు. ఆ చికిత్స వల్ల జైమెన్ పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావం పడింది.
జైమెన్కు కీమోథెరపీ చేసే ముందు వైద్యులు అతని స్టెమ్ సెల్‌ను భద్రపరిచారు. ఆ స్టెమ్ సెల్‌ను పిట్స్బర్గ్ పరిశోధకులు తాజాగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఈ సెల్స్ వృషణాల్లో స్పెర్మ్‌ను ఉత్పత్తి చేస్తాయి. అతి త్వరలో జైమెన్ పునరుత్పత్తి వ్యవస్థ స్పెర్మ్‌ను ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అతి తక్కువ మొత్తంలో స్పెర్మ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, అందువల్ల అతడు తండ్రి అయ్యేందుకు ఐవీఎఫ్ లాంటి పద్ధతులు అవసరమవుతాయని పరిశోధకులు తెలిపారు.
గర్భాశయ మార్పిడి ద్వారా బ్రిటన్‌లో తొలిసారి ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. గర్భం దాల్చడానికి వీలులేని ఆరోగ్య సమస్యలో ఉన్న గ్రేస్ డేవిడ్సన్(36) అనే మహిళకు ఆమె అక్క(42) అవయవ దానం చేసింది. రెండేండ్ల క్రితం వైద్యులు అక్క గర్భ సంచిని డేవిడ్సన్కు మార్పిడి చేయగా, ఫిబ్రవరి 27న డేవిడ్సన్ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది.