సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఒక మహిళ నాలుగు నిండు సిలిండర్లకు ఒకేసారి లాక్కెళ్తోంది. నిజానికి.. నిండుగా ఉన్న ఒక్క పెద్ద సిలిండర్‌ను మోయడమే కష్టం. కానీ.. ఆ మహిళ.. నాలుగు సిలిండర్లను ఒకేసారి లాక్కెళ్తుంది. అందుకే తను ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ అయింది.
మలేషియాకు చెందిన ఖైరూ నీసా అనే 30 ఏళ్ల మహిళ తెరెంగన్ అనే ప్రాంతంలో నివసిస్తుంది. తన భర్త ట్రక్ డ్రైవర్. ఇటీవల తన భర్త మరణించడంతో కుటుంబ పోషణ తన మీద పడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖైరూ నీసా గ్యాస్ సిలిండర్ సప్లయర్‌గా వర్క్ చేయాల్సి వస్తోంది.
సాధారణంగా ఈ వృత్తిలోకి పురుషులే వస్తుంటారు కానీ.. మహిళలు రావడం చాలా అరుదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మహిళ సప్లయర్‌గా చేరి.. అసాధారణ రీతిలో ఒకేసారి నాలుగు సిలిండర్లను మోస్తూ మలేషియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
తను ఒక్క రోజులో కనీసం 60 నుంచి 100 వరకు గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయగలదు. అత్యవసర సమయంలో అయితే ఒకేసారి 7 గ్యాస్ సిలిండర్ల వరకు మోస్తుందట. కుటుంబ పోషణ కోసం ఇంత కష్టపడుతున్న ఆ మహిళ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. తనను చూసి నెటిజన్లు సూపర్ మేడమ్.. మహిళల్లో దాగిఉన్న శక్తిని మీరు వెలికి తీస్తున్నారు. మహిళలు దేంట్లోనూ పురుషుల కన్నా తక్కువ కాదని నిరూపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.