రష్యా- ఉక్రెయిన్ మధ్య రెండో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్ సరిహద్దుల ఇరు పక్షాల నేతలు సమావేశమయ్యారు. యుద్ధ విరమణ, పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు తీసుకోవడం అన్న అంశాలే ప్రధాన ఎజెండా గా ఈ చర్చలు సాగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. చర్చల ద్వారా శాంతి పునరుద్ధరింపబడుతుందని తాము విశ్వసిస్తున్నామని, ఉక్రెయిన్ ప్రజలందరూ తిరిగి శాంతియుత జీవనం వైపు అడుగులు వేయడానికి ఈ చర్చలు దోహదపడతాయని రష్యా ఆకాంక్షించింది. మొదటి విడత కూడా ఈ చర్చలు జరిగాయి. అయితే ఎలాంటి ఫలితాలు రాకుండానే ముగిశాయి. రెండో విడత చర్చల్లో ఏమైనా పురోగతి కనిపిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
బెలారస్ సరిహద్దుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య సోమవారం చర్చలు జరిగాయి. దాదాపు 5 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ నుంచి రక్షణ మంత్రి, అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొంటే.. రష్యా వైపు నుంచి అధ్యక్షుడు పుతిన్ సాంస్కృతిక సలహాదారు నేతృత్వంలో ఓ అధికారుల బృందం హాజరైంది. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. ఇంత సీరియస్ సమావేశాలకు వీరు హాజరు కావడం ఏంటని సూటిగానే ప్రశ్నించింది. ప్రాథమిక డిమాండ్లలోనే ఎవరి పట్టు నుంచి వారు పక్కకు రాకపోవడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి.