కాబూల్ : అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మళ్లీ కీలక ప్రాంతాలను హస్తగతం చేసుకుంటున్నారు. తాజాగా ఆ దేశంలోని రెండవ అతిపెద్ద పట్టణం కాందహార్ ( Kandahar )ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదొకరకంగా ఇస్లామిక్ మిలిటెంట్లకు అతిపెద్ద విజయమే అవుతుంది. ఒకప్పుడు తాలిబన్లకు కాందహార్ అత్యంత బలమైన పట్టణం. వాణిజ్య నిర్వహణకు వ్యూహాత్మకంగా ఈ పట్టణం కీలకమైంది. నిజానికి గురువారం చాలా పట్టణాలు తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు కాందహార్ కూడ వెళ్లడం శోచనీయంగా మారింది.
తాలిబన్లు పుట్టింది కాందహార్‌లో అన్నది చేదు నిజం. ఒకప్పుడు ఈ పట్టణంలో వాళ్లదే పైచేయి. ఈ పట్టణాన్ని వాళ్లు చేజిక్కించుకున్నారంటే.. అది మిలిటెంట్లకు కీలక విజయమే అన్నమాట. నగరం శివార్లను కొన్ని వారాల క్రితమే ఆక్రమించిన తాలిబన్లు.. ఇప్పుడు నగరం నడిబొడ్డులోకి కూడా వెళ్లారు. బుధవారం రోజున తాలిబన్లు.. కాందహార్‌లో ఉన్న సెంట్రల్ జైలులోకి దూసుకువెళ్లారు. నగరం మధ్యలో తాలిబన్లు తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ పట్టణంలో ఉన్న ప్రభుత్వ దళాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఓ మిలిటరీ కేంద్రానికి వాళ్లు వెళ్లినట్లు సమాచారం. కాందహార్ నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. వ్యవసాయపరంగా, పారిశ్రామీకరణ పరంగా ఆ నగరం ముందుంటుంది. దేశంలోనే ఆ నగరం వాణిజ్యానికి ఫేమస్. దీంతో ఆ పట్టణం వ్యూహాత్మకంగా ముఖ్యమైందని భావిస్తున్నారు.
కాబూల్-కాందహార్ రోడ్డు మార్గంలో ఉన్న ఘజ్నీ పట్టణాన్ని కూడా గురువారం తాలిబన్లు ఆక్రమించారు. అది కూడా కీలక పట్ణమే. ఇక సిల్క్ రోడ్డు మార్గంలో ఉన్న ప్రాచీన నగరం హీరత్ వద్ద కూడా తాలిబన్లు తిష్టవేశారు. ఆ పట్టణ వీధుల్లోకి దూసుకువెళ్లిన తాలిబన్లు.. అక్కడ ఉన్న పోలీసు హెడ్‌క్వార్టర్స్‌పై తమ జెండాను ఎగురవేశారు.
లొంగిపోతున్న ఆఫ్ఘన్ దళాలను తాలిబన్లు చంపేస్తున్నారని కాబూల్‌లో ఉన్న అమెరికా ఎంబసీ పేర్కొన్నది. ఇది చాలా హేయంగా ఉందని, యుద్ధ నేరాలు జరుగుతున్నట్లు అమెరికా తెలిపింది. గడిచిన నెల రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ సుమారు వెయ్యి కన్నా ఎక్కువ మంది సాధారణ పౌరులు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న వేలాది మంది ప్రజలు కూడా భయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గడిచిన కొన్ని రోజుల నుంచి సుమారు 72 వేల మంది చిన్నారులు కాబూల్‌కు తరలివచ్చినట్లు తెలుస్తోంది. వాళ్లంతా వీధుల్లోనే నిద్రిస్తున్నట్లు సేవ్ ద చిల్ట్రన్ సంస్థ తెలిపింది.