Guillain-Barre Syndrome | చిలీ, పెరూలను వణికిస్తున్న వింత వ్యాధి.. 3 నెలలపాటు హెల్త్ ఎమర్జెన్సీ.. అసలేంటిది, ఎందుకంత ప్రమాదం..?
Guillain-Barre Syndrome | కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించినప్పటి నుంచి ఏదైనా కొత్త రుగ్మత పేరు వింటేనే జనం గడగడ వణుకుతున్నారు. ఏ రోగం ఎంత విధ్వంసం చేస్తుందోనని హడలిపోతున్నారు. ఈ క్రమంలో దక్షిణ అమెరికా పశ్చిమ తీర దేశాలైన చిలీ, పెరూలను గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనే కొత్త రుగ్మత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో కలకలం సృష్టించినప్పటి నుంచి ఏదైనా కొత్త రుగ్మత పేరు వింటేనే జనం గడగడ వణుకుతున్నారు. ఏ రోగం ఎంత విధ్వంసం చేస్తుందోనని హడలిపోతున్నారు. ఈ క్రమంలో దక్షిణ అమెరికా పశ్చిమ తీర దేశాలైన చిలీ, పెరూలను గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనే కొత్త రుగ్మత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కరోనా మహమ్మారి సమయం నుంచి కూడా ఈ రెండు దేశాల్లో జీబీఎస్ పలుమార్లు బయటపడింది. కానీ, పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఇప్పుడు రెండు దేశాల్లో భారీ సంఖ్యలో జీబీఎస్ కేసులు నమోదవడమేకాకుండా మరణాలు కూడా సంభవిస్తుండటంతో కలకలం చెలరేగింది. రెండు దేశాల్లోనూ మూడేసి నెలలపాటు హెల్త్ ఎమర్జెన్సీ విధించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఎలా ఉంటాయి..? దానికి తగిన చికిత్స ఉందా..? అనే వివరాలు ‘నమస్తే’ పాఠకుల కోసం..
జీబీఎస్ అంటే ఏమిటి..?
జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్. ఈ గులియన్ బారే సిండ్రోమ్ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ (ఒక వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలనే శత్రువులుగా భావించి దాడి చేయడం) సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ బారినపడిన వ్యక్తిలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ అతని నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అంటారు. ఈ సిండ్రోమ్‌వల్ల బాధితుడిలోని నరాలు, కండరాలు బలహీనంగా మారుతాయి. వివిధ రకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకిన వారు.. అలాంటి సమయంలో ఈ గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
లక్షణాలు ఎలా ఉంటాయి..?
జీబీఎస్ బారినపడిన వ్యక్తిలో సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేయడంవల్ల నాడీ వ్యవస్థ క్రమంగా నిర్వీర్యం చేస్తుంది. ముందుగా పాదాల నుంచి మొదలై పైవరకు ఈ సిండ్రోమ్ పాకుతుంది. దాంతో కాళ్లు మొదలు ఒంట్లోని ఒక్కో భాగం కదలికలేకుండా పోతుంది. కండరాలు బలహీనమవుతాయి. దాంతో భరించలేని నొప్పి కలుగుతుంది. విపరీతమైన నిస్సత్తువ ఏర్పడుతుంది. ఈ సిండ్రోమ్ పెద్దవాళ్లలో, ముఖ్యంగా మగవాళ్లలో ఎక్కువగా సంక్రమిస్తుంది. అయితే, అత్యంత అరుదుగానైనా అన్ని వయసుల వారికి ఈ సిండ్రోమ్ ముప్పు పొంచి ఉంటుంది. జీబీఎస్ తాలూకూ అత్యంత ప్రధాన లక్షణం విపరీతమైన నీరసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్స్ వెల్లడించింది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు. తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఎంతలా అంటే మెషిన్ సాయంతో ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుస్తుంది. నరాలు బాగా దెబ్బ తింటాయి కాబట్టి నరాల వ్యవస్థ నుంచి మెదడుకు అస్తవ్యస్త సంకేతాలు అందుతుంటాయి. దాంతో చర్మంలోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ కలుగుతుంది. దవడలు నొప్పిగా మారుతాయి. మాట్లాడటం, నమలడం, మింగడం ఇబ్బందిగా ఉంటుంది. హృదయ స్పందనలో, రక్తపోటులో తేడాలు వస్తాయి. జీర్ణశక్తి మందగిస్తుంది.
జీబీఎస్ సోకడానికి కారణం ఏమిటి..?
గులియన్ బారే సిండ్రోమ్ ఒక అంతుచిక్కని రుగ్మత. ఈ రుగ్మత ఎందుకు వస్తుందనేది ఇప్పటివరకు కచ్చితంగా తెలియదు. తరచూ వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నవారు ఈ సిండ్రోమ్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటున్నది. ముఖ్యంగా కాంపిలోబాక్టర్ జెజునీ అనే బ్యాక్టీరియా ఈ సిండ్రోమ్‌కు కారణంగా మారుతున్నట్టు తెలుస్తున్నది. అదేవిధంగా ఇన్ఫ్లుయెంజా వైరస్, సైటోమెగాలో వైరస్, ఎప్‌స్టెయిన్ బార్ వైరస్, జికా, కొవిడ్ వైరస్లు కూడా జీబీఎస్‌కు దారితీసే ప్రమాదం ఉన్నది.
నిర్ధారణ ఎలా.. చికిత్స ఏమిటి..?
ఈ సిండ్రోమ్ రోగ లక్షణాలను పరిశీలించడానికి నరాల పరీక్ష తోడ్పడుతుంది. ముఖ్యంగా స్పైనల్ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటి పరీక్షలు ఈ సిండ్రోమ్‌ను కచ్చితంగా పట్టిస్తాయి. జీబీఎస్‌కు ఇప్పటికైతే ఇదమిద్దంగా చికిత్స అంటూ ఏమీ లేదు. సమస్య తీవ్రతను తగ్గించి, త్వరగా కోలుకునేందుకు సాయపడే మార్గాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఈ వైరస్ బాధితులకు ప్రధానంగా వాడుతున్న చికిత్స ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ). ఈ చికిత్స వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ అతని నాడీవ్యవస్థపై దాడికి దిగకుండా నియంత్రిస్తుంది. అందకే సమయానికి వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే శరీరమంతా ఈ వ్యాధి విస్తరించి ప్రాణాంతకం అవుతుంది. ఈ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సకు కొన్ని వారాల నుంచి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉన్నది.
అమెరికాలో ప్రతి లక్ష మందిలో ఒకరికి జీబీఎస్
అమెరికాకు చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెంటర్ (US CDC).. జీబీఎస్ అత్యంత అరుదుగా సోకే రుగ్మతలే అయినా చాలా ప్రమాదకరమైనదని తెలిపింది. అమెరికాలో ప్రతి లక్ష మందిలో ఒకరు జీబీఎస్ బారిన పడుతున్నారని పేర్కొంది. జీబీఎస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఇద్దరికి ఆ వ్యాధి లక్షణాలు బయటపడటానికి కొన్ని వారాల ముందే నీళ్ల విరేచనాలు, శ్వాససంబంధ ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయని వెల్లడించింది. అదేవిధంగా అమెరికాలో కాంపిలో బ్యాక్టర్ ఇన్ఫెక్షన్కు గురైన ప్రతి 1000 మందిలో ఒకరు జీబీఎస్ బారిన పడుతున్నారని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

