ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, కొత్త అవతారమెత్తారు. లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి హీరో మాదిరిగా కనిపించారు. భారీ క్షిపణి ప్రయోగాన్ని లీడ్ చేసిన కిమ్, ఆ తతంగాన్ని ఒక హాలీవుడ్ సినిమా మాదిరిగా చూపించారు. 2017 తర్వాత శుక్రవారం మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. భారీ హ్వాసాంగ్-17 క్షిపణి ప్రయోగం వీడియోను ఒక మూవీ మాదిరిగా చిత్రీకరించింది.
ఉత్కంఠ భరితమైన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఇద్దరు జనరల్స్ మధ్య ఉన్న కిమ్, హిరో స్టైల్లో వారితో కలిసి నడుస్తారు. తర్వాత కిమ్, ఇద్దరు జనరల్స్ తమ చేతి వాచీలో టైమ్ చూస్తారు. అనంతరం కిమ్ స్లో మోషన్లో తన సన్ గ్లాసెస్ తీసి తుడిచి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. దీంతో భారీ ఖండాంతర క్షిపణి ఉన్న వాహనాన్ని ప్రయోగానికి తరలించాలని జనరల్స్ ఆదేశిస్తారు.
ఆ వాహనం ప్రయోగ స్థలానికి చేరిన తర్వాత కిమ్తోపాటు జనరల్స్ కౌంట్ డౌన్ ఆదేశాలిస్తారు. దీంతో సైనికులు ఫైర్ అని నినాదాలు చేస్తారు. ఒక సైన్యాధికారి క్షిపణి ప్రయోగం బటన్ను ప్రెస్ చేస్తారు. దీంతో అది ఆకాశంలోకి దూసుకెళ్తుంది. ఈ ప్రయోగంలో పాల్గొన్న సైనికులతో కలిసి కిమ్ నడిచి వెళ్తున్న దృశ్యంతో ఈ వీడియో ముగుస్తుంది. 11.53 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఉత్తర కొరియా టీవీ ప్రసారం చేసింది.
కాగా, గతం మాదిరిగానే ఈ భారీ ఖండంతర క్షిపణి పరీక్ష విఫలమైంది. జపాన్ సముద్రంలో అది పడింది. అయితే తన సైనిక సత్తాన్ని ప్రపంచానికి చాటేందుకే కొత్త తరహాలో హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉన్న ఈ వీడియోను ఉత్తర కొరియా విడుదల చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి పరీక్షపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) అప్రమత్తమైంది. దీనిపై అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. పలు క్షిపణి ప్రయోగాలతో అగ్ర దేశం అమెరికాను వణికిస్తున్న ఉత్తర కొరియాపై ఇప్పటికే ఐరాస పలు ఆంక్షలు విధించింది.