Iran vs US : అగ్రరాజ్యం అమెరికా (USA) భూతల దాడికి దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ (Iran) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా గట్టిగా బదులిస్తామని స్పష్టంచేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ (Esmaeil Baghaei) మాట్లాడుతూ.. అమెరికాతో కుదిరిన అవగాహనా ఒప్పందం స్పష్టంగా ఉందని, అందులో ఎలాంటి సందిగ్ధత లేదని అన్నారు.
ఒప్పందం చిన్నదే అయినా మొత్తం 14 క్లాజ్లు ఉన్నాయని ఇస్మాయిల్ బఘాయీ చెప్పారు. హర్మూజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణ బాధ్యత ఇరాన్‌కే చెందుతుందని, ఈ అంశాన్ని ఒమన్‌తోపాటు ప్రాంతీయ దేశాలతో చర్చిస్తూ ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఒప్పందంలోని నిబంధనలు స్పష్టంగా ఉన్నందున, దాన్ని ఉల్లంఘించడానికి అమెరికాకు ఎలాంటి అవకాశం లేదని తెలిపారు. ఇదిలావుంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై సైనిక చర్యలు విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే సైనిక సామర్థ్యం అమెరికాకు ఉన్నప్పటికీ.. దాన్ని ఎక్కువ రోజులు ఆధీనంలో ఉంచుకోవడం అంత సులభం కాదని భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆక్రమణకు దిగితే ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బుషెహర్ ప్రావిన్స్ తీరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్గ్ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రం. ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతుంది.