Military Plane : అమెరికాకు చెందిన యుద్ధ విమానం రష్యాలో దిగడం సంచలనం కలిగిస్తోంది. అమెరికా-రష్యాల మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. అలాంటిది, అమెరికాకు చెందిన యుద్ధ విమానం ఇప్పుడు రష్యాలోని మాస్కోలో ల్యాండ్ అవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. విమానాల రవాణాను ట్రాక్ చేసే ఫ్లైట్రాడార్24 సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ద బోయింగ్ సి-17 గ్లోబ్‌మాస్టర్ అనే అమెరికాకు చెందిన యుద్ధ విమానం రష్యాలోని మాస్కోలో ల్యాండ్ అయింది.
భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ విమానం ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఈ రోజు ఉదయం లాట్వియా దేశంలోని రిగా నుంచి బయల్దేరింది. ఇది సైనిక రవాణా విమానం. అమెరికా, వాషింగ్టన్ డీసీలోని స్ప్రింగ్స్ ఎయిర్‌బేస్ క్యాంప్ నుంచి ఆగష్టు 23న ఈ విమానం బయల్దేరి రిగా వెళ్లింది. అక్కడి నుంచి ఇప్పుడు రష్యా చేరుకుంది. ఉక్రెయిన్, రష్యా మధ్య ఇటీవల మళ్లీ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య శాంతి కోసం ఇంతకుముందు అమెరికా చేసిన ప్రయత్నాలు నిలిచిపోయాయి.
అయితే, ఈ అంశంపై చర్చించేందుకు అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవెన్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ త్వరలో రష్యా రావాల్సి ఉంది. ఈ చర్చల్లో భాగంగానే అమెరికా విమానం రష్యా వచ్చిందా అనే సందేహాలున్నాయి. అయితే, దీనిపై అమెరికా నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు ఈ విమానం గురించిన సమాచారం తమకు కూడా తెలియదని రష్యా ప్రభుత్వం తెలిపింది. అది కార్గో విమానమా, ప్యాసింజర్ విమానమా అనేది కూడా తెలియదని పేర్కొంది. అమెరికా ప్రతినిధులు రష్యాను సందర్శించినప్పుడు లేదా కీలక సందర్భాల్లో మాత్రమే అమెరికా యుద్ధ విమానాలు రష్యా వెళ్తుంటాయి.
చివరగా గత జనవరిలో అమెరికా ప్రతినిధులు రష్యాలో పర్యటించినప్పుడు మాత్రమే ఒక అమెరికన్ యుద్ధ విమానం రష్యా వెళ్లింది. మళ్లీ ఇప్పుడు మరో విమానం రష్యాలో ల్యాండ్ అయింది. ఇప్పుడు రెండు దేశాల నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.