అది అమెరికాలోని పెన్సిల్వేనియా. ఆ నగరమంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. ఫైర్ సిబ్బంది వచ్చే లోపే ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం సంభవించిన ఇంటిని చూసి ఫైర్ ఫైటర్ షాకయ్యాడు. ఎందుకంటే అగ్నిప్రమాదం జరిగింది తన ఇంట్లోనే. ఆ ఇంట్లో ఉన్న 14 మందిలో 10 మంది సజీవదహనం అయ్యారు.
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని ఫైర్ కంపెనీ ఫైర్ ఫైటర్ హరోల్డ్ బేకర్‌కు సమాచారం అందింది. అప్రమత్తమైన బేకర్ తన సిబ్బందితో ఘటనాస్థలికి బయల్దేరాడు. ఆ వీధిలోకి ఎంటర్ కాగానే బేకర్ షాకయ్యాడు. ఎందుకంటే మంటలు ఎగిసిపడుతున్నది తన ఇంట్లోనే అని తెలుసుకుని.
అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు పెద్దలు, ముగ్గురు చిన్నారులు కాలి బూడిదైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ ఇంట్లో మొత్తం 14 మంది నివసిస్తుండగా.. మరో ముగ్గురు అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డారు. న్యూస్ పేపర్ బాయ్‌గా పని చేస్తున్న మరొకరు ఇంట్లో లేరు. అలా నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో బేకర్ కుమారుడు, కూతురు, మామ, బామ్మర్ది, మరదలు, ముగ్గురు చిన్నారులు, మరో ఇద్దరు బంధువులు ఉన్నారు. మృతులందరూ 6 నుంచి 70 సంవత్సరాల వయసు మధ్య ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.