Donald Trump : అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌పై.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్ గొప్ప భాగస్వామి, మిత్రదేశం అంటూ పొగిడారు. సంక్షోభ సమయంలో అండగా ఉన్నందుకు ఇజ్రాయెల్‌పై ప్రశంసలు కురిపిస్తూనే, ఇంతకాలం మిత్రదేశాలుగా భావించిన నాటో దేశాలు సహాయం చేయకపోవడంపై పరోక్షంగా విమర్శలు చేశారు. తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
‘‘ప్రజలు ఇజ్రాయెల్‌ను ఇష్టపడ్డా, లేకున్నా.. ఆ దేశం మాత్రం అమెరికాకు మిత్ర దేశం అని నిరూపించుకుంది. ఇజ్రాయెల్ ధైర్యంగల, నమ్మదగ్గ, తెలివైన దేశం. సంక్షోభం, ఒత్తిడి సమయంలో అండగా నిలబడకుండా, వారి నిజస్వరూపం చూపించిన ఇతర దేశాల్లాగా కాకుండా ఇజ్రాయెల్ బలంగా పోరాడింది. అలాగే, ఆ దేశానికి ఎలా గెలవాలో కూడా తెలుసు’’ అని ప్రకటించారు. ఈ సంక్షోభం సమయంలో తమకు అండగా నిలవని నాటో దేశాలపై పరోక్షంగా ట్రంప్ విమర్శలు చేశారు. అయితే, ట్రంప్ ప్రశంసలపై ఇజ్రాయెల్ కానీ, ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కానీ స్పందించలేదు. మరోవైపు ఇజ్రాయెల్‌కు, లెబనాన్‌కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబులు కురిపించదని వెల్లడించారు.
ఇక, ఈ యుద్ధం సమయంలో తమకు సైనిక సాయం అందించాలని నాటో దేశాల్ని అమెరికా కోరిన సంగతి తెలిసిందే. కానీ, ఈ యుద్ధంలో పాల్గొనేందుకు నాటో దేశాలు నిరాకరించాయి. అంతేకాదు.. ఈ యుద్ధంలో ట్రంప్ వైఖరిని అనేక దేశాలు విమర్శించాయి. దీంతో ఆయా దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే నాటో కూటమి నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.