ఉక్రెయిన్ అధ్యక్షుడు చనిపోతే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నకు అగ్రరాజ్యం అమెరికా సమాధానం చెప్పింది. వాళ్ల అధ్యక్షుడు చనిపోయినా కూడా ప్రభుత్వం కొనసాగేలా ఉక్రెయిన్ చర్యలు తీసుకుందని అమెరికా యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటనీ బ్లింకెన్ చెప్పారు. జెలెన్స్కీ లేకపోయినా కూడా ఉక్రెయిన్‌కు అమెరికా సహకారం అందిస్తుందా? అని ప్రశ్నించగా బ్లింకెన్ ఈ సమాధానం ఇచ్చారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత మూడు సార్లు జెలెన్స్కీని చంపే ప్రయత్నాలు జరిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా నేతలతో మాట్లాడిన జెలెన్స్కీ తనను ప్రాణాలతో చూడటం అదే చివరిసారి అవ్వొచ్చని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ చనిపోయినా ఉక్రెయిన్ ప్రభుత్వం కొనసాగేందుకు చర్యలు సిద్ధం అయ్యి ఉన్నాయని బ్లింకెన్ చెప్పారు.
జెలెన్స్కీ, అతని ప్రభుత్వం చూపించిన తెగువను మెచ్చుకున్న బ్లింకెన్.. రష్యాపై విధించిన ఆంక్షలు ప్రభావం చూపుతున్నాయని, ప్రజలు నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కానీ పుతిన్ మొండితనం కారణంగా ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగేలా కనిపిస్తోందని పేర్కొన్నారు.