G-7 on Russia | ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా మీద మరో దఫా ఆంక్షలు విధించేందుకు పశ్చిమ దేశాలు సిద్ధం అయ్యాయి. జీ-7 కూటమి దేశాలతో సంప్రదిస్తున్నట్లు బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి లిజ్ ట్రస్ చెప్పారు. రష్యన్ బ్యాంకులపై అదనపు ఆంక్షలు విధిస్తామని గురువారం తెలిపారు. రష్యా ముడి చమురు, గ్యాస్, బొగ్గు దిగుమతిని పూర్తిగా తగ్గించుకునేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలుకు జీ-7 దేశాలు అంగీకరించాయన్నారు.
రష్యాలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బేర్ బ్యాంక్, క్రెడిట్ బ్యాంక్ ఆఫ్ మాస్కోలపై కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు లిజ్ ట్రస్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా రష్యా బొగ్గు, ముడి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని బ్రిటన్ ప్రతీన బూనుతున్నట్లు తెలిపారు. రష్యాకు కీలక రంగాలపై చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు.
రష్యా స్టీల్, ఐరన్ ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించాలని బ్రిటన్ తలపోస్తున్నది. రష్యాకు ప్రధానంగా స్టీల్, ఐరన్ నుంచి అత్యధిక రెవెన్యూ వస్తున్నది. రష్యాపై తాజాగా ఐదో దఫా ఆంక్షలకు బ్రిటన్ సిద్ధం అవుతున్నది. పుతిన్ యుద్ద పిపాసకు అడ్డుకట్ట వేసేందుకు రష్యా వ్యాపారాలపై ఆంక్షలు విధిస్తామని సంకేతాలిచ్చింది.