Trump Warns Apple | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆపిల్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోనే ఫోన్లను తయారు చేయాలని చెప్పారు. భారత్ లేదంటే అమెరికా వెలుపల ఉత్పత్తి చేసే చాలా ఖరీదైందవుతుందని పేర్కొంది. ఆపిల్ ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జూన్ ఒకటి నుంచి యూరోపియన్ యూనియన్‌పై నేరుగా 50శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో యూఎస్ ఫ్యూచర్స్, ప్రపంచ మార్కెట్లో నష్టాలు కనిపించాయి. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో ‘యునైటెడ్ స్టేట్స్లో విక్రయించే ఐఫోన్లను భారత్, ఇతర దేశాల్లో కాకుండా అమెరికాలో తయారు చేయాలని ఆశిస్తున్నట్లుగా టిమ్ కుక్‌తో చాలాకాలం కిత్రం చెప్పాను. ఇది జరుగకపోతే ఆపిల్ అమెరికాకు కనీసం 25శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది’ వార్నింగ్ ఇచ్చారు.
బెదిరింపుల నేపథ్యంలో ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. దాంతో ఆపిల్ అమ్మకాలు దెబ్బతినడంతో పాటు లాభాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, అమెజాన్, వాల్‌మార్ట్, ఇతర ప్రధాన కంపెనీలతో పాటు ఆపిల్ సైతం వైట్‌హౌస్ టార్గెట్లోకి చేరింది. వాస్తవానికి, ఈ కంపెనీలు ట్రంప్ విధించిన సుంకాలతో ఏర్పడిన అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిడికి ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ గతవారంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తాను ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడానని, భారత్‌లో ఆపిల్ ఉత్పత్తిని విస్తరించొద్దని కోరినట్లు చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. దోహాలో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ టిమ్ కుక్‌తో మాట్లాడారు. అయితే, అత్యధిక సుంకాలున్న దేశాల్లో భారత్ ఒకటని.. భారత్‌లో అమ్మడం చాలాకష్టమని సూచించారు.
ట్రంప్ చైనాపై సుంకాల కారణంగా ఆపిల్ తన సరఫరా గొలుసును సర్దుబాటు చేసుకుంటున్నది. ఈ విషయంలో ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని భారత్‌కు మార్చేందుకు ఆలోచిస్తున్నది. ఈ క్రమంలో గత కొద్ది సంవత్సరాలు ఆపిల్ భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తున్నది. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్ వంటి కాంట్టాక్ట్ తయారీదారుల ద్వారా కంపెనీ దేశంలో ఐఫోన్లను తయారు చేస్తున్నది. ఎలక్ట్రానిక్స్‌లో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఆపిల్ ఇటీవల భారతదేశంలో ఉత్పత్తిని మరింత విస్తరించాలని నిర్ణయించిన సమయంలో ట్రంప్ నుంచి హెచ్చరికలు రావడం గమనార్హం. కంపెనీ ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో అనేక మోడల్ ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. ఈ క్రమంలో ఆపిల్ ఉత్పత్తులు పెరగనున్నాయి. ప్రతి ఐదు ఫోన్లలో ఒకటి భారత్‌లోనే అసెంబుల్ చేయబడుతున్నది. 2024-25 లో భారత్‌లో ఐఫోన్ల ఉత్పత్తి 60శాతం పెరిగి రూ.1.89లక్షలకోట్లకు చేరుకుందని అంచనా.
ఇందులో రూ.1.5లక్షలకోట్లు ఎగుమతులు ఉన్నాయి. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ వంటి ప్రధాన కాంట్రాక్ట్ తయారీదారులు భారతదేశంలో ఐఫోన్లను అసెంబుల్ చేస్తారు. దిగ్గజ టెక్ కంపెనీ ఆపిల్ వచ్చే ఏడాది నుంచి అమెరికాలో అమ్ముడయ్యే అన్ని ఐఫోన్లను భారతదేశంలో తయారు చేయాలని యోచిస్తోందని గతంలో ఓ నివేదిక తెలిపింది. ఇది మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడమే కాకుండా ప్రపంచ తయారీ కేంద్రంగా మారడానికి భారతదేశం స్థానాన్ని బలోపేతం చేస్తుందని నివేదిక పేర్కొంది. 2026 చివరి నాటికి అమెరికాలో అమ్ముడయ్యే 6 కోట్లకుపైగా ఐఫోన్ల ఉత్పత్తిని పూర్తిగా భారతీయ ప్లాంట్‌కు మార్చాలని ఆపిల్ భావిస్తున్నట్లుగా ఓ నివేదిక తెలిపింది. బెంగళూరు, పూణే, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయిలో నాలుగు కొత్త స్టోర్స్‌ని ప్రారంభించడం ద్వారా ఆపిల్ తన భారత్‌లో ఉత్పత్తిని, రిటైల్ అమ్మకాలను పెంచాలని యోచిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ వివిధ రోల్స్ కోసం భారత్‌లో 3వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకుంటున్నది.