Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald trump) సుమారు 37 ఏళ్ల తర్వాత తొలిసారి ఎయిర్‌ఫోర్స్ వన్ (Airforce One) విమానంలో ప్రయాణించారు. ఇటీవల ఆధునికీకరించిన కొత్త ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానంలో ఆయన తొలి ప్రయాణం చేశారు. నార్త్ డకోటా (North Dakota) లో ఏర్పాటు చేసిన థియోడర్ రూజ్వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ప్రారంభోత్సవానికి ఆయన ఈ కొత్త విమానంలో వెళ్లారు. దాదాపు నాలుగు దశాబ్దాల విరామం అనంతరం అందుబాటులోకి వచ్చిన కొత్త అధ్యక్ష విమానంలో ఇదే తన తొలి ప్రయాణమని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.
మెడోరాలో నిర్వహించిన కార్యక్రమంలో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. 37 ఏళ్ల తర్వాత ఎయిర్ ఫోర్స్ వన్ అనే ఒక ప్రత్యేక విమానంలో ఇది తొలి ప్రయాణమని అన్నారు. ఇదొక అద్భుతమైన విమానమని ఆయన ప్రశంసించారు. తాను ఎంతగానో ఆరాధించే మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ పట్ల గౌరవ సూచకంగా ఈ పర్యటన సాగిందని చెప్పారు. వైట్‌హౌస్‌లోని రూజ్వెల్ట్ రూమ్‌లో భద్రపరిచిన ఆయన ‘కాంగ్రెషనల్ మెడల్ ఆఫ్ హానర్’ను ట్రంప్ స్వయంగా ఈ లైబ్రరీకి అందజేశారు. ఈ సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తొలి సిట్టింగ్ ప్రెసిడెంట్‌గా ట్రంప్ రికార్డు సృష్టించారు.
ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన ఇంటీరియర్ సెక్రటరీ డగ్ బర్గమ్ దీనిని ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. లైబ్రరీ ప్రారంభమైన తర్వాత రూజ్వెల్ట్ రాసిన ప్రఖ్యాత ‘మ్యాన్ ఇన్ ది అరీనా’ వ్యాసాన్ని ట్రంప్ చదువుతుండగా రూపొందించిన రికార్డింగ్‌ను సందర్శకులు వినవచ్చు. లైబ్రరీ తొలి ఏడాది ప్రదర్శనల కోసం నేషనల్ ఎండోమెంట్ ఫర్ హ్యుమానిటీస్ ద్వారా 7,50,000 డాలర్ల ఫెడరల్ గ్రాంటును కూడా ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుత అధ్యక్ష విమానాలు గత మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాయి. వాణిజ్య విమానాలను అత్యంత సురక్షితమైన అధ్యక్ష విమానాలుగా మార్చడానికి అనేక సంక్లిష్ట నిబంధనలు ఉండటంతో, ఈ ఆధునికీకరణ పనులు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి.