Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏం చేసినా సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ట్రంప్ తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఓ 13 ఏళ్ల బాలుడిని అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ (Secret Service agent)గా నియమించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
యూఎస్ సీక్రెట్ సర్వీస్ (United States Secret Service) ఏజెంట్‌గా క్యాన్సర్‌తో పోరాడి మహమ్మారిని జయించిన 13 ఏళ్ల బాలుడు డీజే డేనియల్ (DJ Daniel)ని నియమిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్.. గ్యాలరీలో కూర్చొని ఉన్న బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక ఐడీ కార్డును అతడికి అందజేశారు. ఆ సమయంలో సభలో డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా ఉండగా.. అంతా కలిసి చప్పట్లు కొట్టారు. అరుదైన గౌరవం దక్కించుకున్న ఆ బాలుడికి అభినందనలు తెలిపారు.
తన ప్రసంగంలో ఆ బాలుడి గురించి ట్రంప్ అందరికీ పరిచయం చేశారు. డీజే డేనియల్ వయసు ప్రస్తుతం 13 ఏళ్లు. అతడికి 7 ఏళ్ల వయసు ఉండగా అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అతడికి అరుదైన క్యాన్సర్ సోకినట్లు గుర్తించారు. అంతేకాకుండా 5 నెలల కంటే ఎక్కువగా బతకడని కూడా చెప్పారు. అలా వైద్యులు చెప్పడంతో వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తీవ్రమైన దుఃఖంతోనే డేనియల్ను కాపాడుకునేందుకు అతడి తల్లిదండ్రులు విపరీతంగా కష్టపడ్డారు. గత ఆరేళ్లుగా అతడికి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. చివరికి ఆ బాలుడు మహమ్మారిని జయించినట్లు ట్రంప్ వివరించారు. అందుకే ఇప్పుడు అతడికి ఈ గొప్ప గౌరవం ఇస్తున్నట్లు చెప్పారు.
Also Read..
Tariffs | ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై సుంకాలు.. కాంగ్రెస్ సంయుక్త సెషన్లో బాంబు పేల్చిన ట్రంప్
Donlad Trump | ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన జెలెన్స్కీ.. అలా చేయడం తప్పే అంటూ పశ్చాత్తాపం
Warren Buffett | ట్రంప్ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది : వారెన్ బఫెట్