వాషింగ్టన్, జనవరి 7: భారతీయుల డాలర్ డ్రీమ్ చెదురుతున్నది. అమెరికా వెళ్లాలి.. డాలర్లు వెనకేయాలి.. ఉన్నత స్థితికి చేరుకోవాలి అనుకునే సగటు భారతీయుడి ఆశల సౌధం బీటలు వారుతున్నది. అమెరికా జాబ్ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఉపాధి కోసం అమెరికా వెళ్దామనుకునేవారి సంగతి అటుంచితే.. ఎప్పుడు తమ ఉద్యోగాలు ఊడుతాయో అని అమెరికాలోని భారత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగ భయం వారిని వెంటాడుతున్నది. దీంతో ఇక్కడే ఉండాలా.. స్వదేశానికి తిరిగి వెళ్లాలా అని వారు అయోమయం చెందుతున్నారు.
భారీగా ఉద్యోగాల కోత..
ప్రస్తుతం అమెరికాలో వేలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలతో పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. పెద్దపెద్ద సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. ఇలా జాబ్‌లు కోల్పోయిన వారిలో చాలామంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కష్టంగా మారింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా చాలా కంపెనీలో కొత్తగా నియామకాలు కూడా చేపట్టడం లేదు. అమెజాన్, మెటా, సేల్స్‌ఫోర్స్, ట్విట్టర్, ఉబర్ వంటి సంస్థలు వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది కూడా టెకీలకు గడ్డుకాలం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది లేఆఫ్‌లు భారీగా ఉంటాయని, హెచ్1బీలకు సైతం ఉద్యోగాలు దొరక్కపోవచ్చని అంటున్నారు. అమెరికాలో ఉద్యోగాన్ని కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే దేశాన్ని వీడక తప్పదు.
ఇంతటి దారుణ పరిస్థితులు ఎన్నడూ లేవు..
హెచ్1బీ వీసాపై వచ్చి ఉద్యోగం చేస్తూ ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన పలువురి వ్యథలను లింక్డ్ఇన్ తెలియజేసింది. భారత సంతతికి చెందిన నితీశ్ భాంద్రే (39) అనే డాటా ఇంజనీర్ తన గురించి తెలియజేస్తూ ‘ట్విట్టర్లో జాబ్ చేసే నేను ఇటీవల ఉద్యోగం కోల్పోయాను. అయితే నా వృత్తికి సంబంధం లేని మరో ఉద్యోగాన్ని అందిపుచ్చుకున్నాను. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో ఏ సంస్థ కూడా పూర్తిస్థాయి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా లేవు, అయినా నమ్మకం కోల్పోకుండా భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో మంచి కాలం కోసం ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నాడు. అడోబ్, ఫ్లిప్‌కార్ట్, జిట్ హబ్‌లాంటి సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం మెటాలో చేస్తూ ఉద్యోగం పోగొట్టుకున్న ఖరగ్‌పూర్ ఐఐటీ గ్రాడ్యుయేట్ హిమాన్షు మాట్లాడుతూ ‘ఉద్యోగ బదిలీల్లో భాగంగా మెటా కంపెనీ నన్ను యూఎస్ నుంచి కెనడాకు పంపింది. అయితే ఇక్కడకు వచ్చిన రెండు రోజులకే సామూహిక తొలగింపులో భాగంగా నన్ను తీసేశారు’ అని తెలిపాడు. రాజు కడం మాట్లాడుతూ ‘మెటా కంపెనీలో తొమ్మిది నెలలుగా పని చేస్తున్నాను. అన్ని త్రైమాసికాల్లోనూ చక్కటి పనితీరు కనబర్చాను. అయినా ఉద్యోగం నుంచి ఉద్వాసన తప్పలేదు. గత 16 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగం కోల్పోవడం లాంటి అధ్వాన స్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు’ అని తెలిపాడు.