మాస్కో/కీవ్, ఏప్రిల్ 26: ఉక్రెయిన్‌కు అమెరికా, మిత్రదేశాలు మద్దతు పలుకుతుండటం, ఆయుధాలు అందించడంపై రష్యా ఘాటుగా స్పందించింది. ప్రస్తుత పరిస్థితులు, ఉద్రిక్తతల దృష్ట్యా మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవమేనంటూ హెచ్చరించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్ మాట్లాడుతూ కృత్రిమంగా సృష్టిస్తున్న అణు సంఘర్షణ ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. ‘అది వాస్తవం. తక్కువగా అంచనా వేయొద్దు’ అని పేర్కొన్నారు. యుద్ధంలో పాలుపంచుకోవాలని ఉక్రెయిన్ నేతలు నాటో దేశాలను కోరుతూ రష్యాను రెచ్చగొడుతున్నారని, నాటో కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని అన్నారు.
లావ్రోవ్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా స్పందించారు. యుద్ధంలో ఓటమిని రష్యా ముందే గ్రహించిందని, ఇందుకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా ప్రపంచ దేశాలను భయపెట్టేందుకు ప్రయత్నించిన రష్యా చివరి ఆశలు కూడా కోల్పోయిందని అన్నారు. ఉక్రెయిన్‌కు ప్రపంచం రెట్టింపు మద్దతు ఇవ్వాలని కోరారు. యుద్ధంలో నేరుగా పాలుపంచుకోని అమెరికా, పలు నాటో దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా విదేశాంగ, రక్షణ శాఖ మంత్రులు బ్లింకెన్, ఆస్టిన్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఆయుధ సాయానికి అంగీకారం కుదుర్చుకున్నారు.
తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. లుహాన్స్, డొనెట్స్ రీజియన్‌లోని పట్టణాలపై పౌరులే లక్ష్యంగా దాడులు చేయగా, దాదాపు 10 మంది మరణించారు. క్రెమిన్నా నగరాన్ని రష్యా బలగాలు అధీనంలోకి తీసుకున్నాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందించాలని ఐరాస శరణార్థి సంస్థ కోరింది. రష్యా, ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని ఐరాస చీఫ్ గుటెరస్ పిలుపునిచ్చారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన విదేశాంగ మంత్రి లావ్రోవ్తో సమావేశమయ్యారు.