టోక్యో, డిసెంబర్ 31: అంతరిక్షానికి వెళ్లేందుకు భవిష్యత్తులో రాకెట్ల అవసరం ఉండదా? మన భవనాల్లో ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లినట్టుగా ఎలివేటర్ ద్వారా వెళ్లిపోవచ్చా? సైన్స్ ఫిక్షన్ సినిమా కథను తలపించే ఈ అసాధారణ పని ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాన్ని తలకెత్తుకుంది ఒబాయాషి కార్పొరేషన్ అనే జపాన్ సంస్థ. ఈ సంస్థ భూమి పైనుంచి అంతరిక్షానికి స్పేస్ ఎలివేటర్ నిర్మించాలని భావిస్తున్నది. 2050 నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
ఇప్పుడు అంతరిక్షానికి వ్యోమగాములను పంపాలన్నా, ఉపగ్రహాలు, వస్తువులను చేరవేయాలన్నా వాహకనౌకల ద్వారా మాత్రమే సాధ్యం. వీటి అవసరం లేకుండా స్పేస్ ఎలివేటర్లతో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ైక్లెంబర్ల ద్వారా అంతరిక్షానికి వ్యోమగాములను పంపించవచ్చని ఒబాయాషి సంస్థ చెప్తున్నది. సోలార్, మైక్రోవేవ్ ఎనర్జీ ద్వారా ఈ స్పేస్ ఎలివేటర్లు పని చేస్తాయట. రాకెట్లను పంపించేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 90 శాతం తక్కువ ఖర్చుతో వ్యోమగాములను, వస్తువులను కక్ష్యలోకి పంపేందుకు వీలు కలుగుతుందని, ఒక కిలో పేలోడ్‌ను పంపించడానికి కేవలం రూ.2 వేలు ఖర్చు అవుతుందని ఈ సంస్థ చెప్తున్నది.
స్పేస్ ఎలివేటర్ కోసం కార్బన్ నానోట్యూబ్‌లను ఉపయోగించి కేబుల్(తెథెర్) నిర్మించాలని ఈ సంస్థ ప్రణాళికతో ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా దీనిని తయారుచేయడం తమ ముందున్న అతి పెద్ద సవాల్ అని చెప్తున్నది. స్పేస్ ఎలివేటర్ నిర్మాణం పూర్తయితే అంతరిక్ష పర్యాటకానికి అవకాశం కలుగుతుందని, అంతరిక్ష మైనింగ్ సులువు అవుతుందని అంచనా వేస్తున్నది. పైగా రాకెట్లలా స్పేస్ ఎలివేటర్లు కాలుష్యానికి కూడా కారణం కాబోవని చెప్తున్నది.