భారత్ ఏ వస్తువులు అడిగినా.. వాటిని సరఫరా చేసేందుకు తాము సదా సిద్ధంగానే వున్నామని రష్యా విదేశాంగ మత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. అలాగే భారత్తో ఏ విషయంపైనైనా చర్చించడానికి కూడా తాము సిద్ధమని స్పష్టం చేశారు. భారత్- రష్యా చాలా మంచి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. రష్యా విదేశాంగ మంత్రి భారత్ విషయంలో అమెరికా పెడుతోన్న ఒత్తిడి రష్యా- భారత్ సంబంధాలపై ఏమైనా ప్రభావం చూపెడుతుందా? అని ప్రశ్నించగా… అలాంటిదేమీ ఉండదని నొక్కి చెప్పారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లూ పనిచేయవని తేల్చి చెప్పారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోడానికి అమెరికా ఎక్కువ మక్కువ చూపుతుందని సెర్గీ లావ్రోవ్ చురకలంటించారు.
యుద్ధం కాదు.. అదో స్పెషల్ ఆపరేషన్
ఉక్రెయిన్పై తాము చేస్తున్నది యుద్ధం ఎంత మాత్రమూ కాదని, అదో స్పెషల్ ఆపరేషన్ అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటూ తాము దాడులు చేశామని అన్నారు. భారత విదేశాంగ విధానం స్వతంత్రమైనదని, రష్యా విధానం కూడా అదేనని అన్నారు. అందుకే ఇరు దేశాలు మంచి మిత్రులుగా ఉన్నాయని సెర్గీ లావ్రోవ్ అన్నారు.