వాషింగ్టన్: ఉక్రెయిన్‌లోని ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అభిప్రాయపడింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా దళాలు బలహీనపడినా.. స్వల్ప స్థాయిలో ఆ బలగాలు ముందుకు కదులుతున్నట్లు అంచనా వేశారు. దీని ఆధారంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉన్నట్లు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవిరిల్ హెయిన్స్ తెలిపారు. ఇటీవల డాన్బాస్ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు రష్యా విస్తృత రీతిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం ప్రారంభానికి ముందు ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయో, ఆ టార్గెట్‌తోనే పుతిన్ ఉన్నారని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హెయిన్స్ తెలిపారు. కానీ ఆ లక్ష్యాన్ని ఇప్పట్లో రష్యా అందుకోలేదని ఆమె అన్నారు. కీవ్‌ను ముట్టడించాలని మొదట్లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన రష్యా.. ఇప్పుడు డాన్బాస్ ప్రాంతంపై పట్టు సాధిస్తోందని అన్నారు. రష్యా మిలిటరీ లక్ష్యాలు, సామర్థ్యం మధ్య తేడా ఉన్నట్లు చెప్పారు. సివెరొడోనెస్కీ నగరాన్ని హస్తగతం చేసుకున్న రష్యా.. నెమ్మదిగా ఆ ప్రాంతంలో పట్టు సాధిస్తున్నట్లు ఆమె అన్నారు.