యూరప్‌ను కుదిపేస్తున్న నిరసనలు
ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అల్బేనియాలో ఆందోళనలు.. ఇటలీలో యువత ర్యాలీలు.. రోమ్‌లో పోలీసులతో ఘర్షణ.. అల్బేనియాలో ప్రభుత్వ భవనాలకు నిరసనకారుల నిప్పు.
రోమ్: యూరప్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. గత వారం జరిగిన ఘర్షణలు, దుకాణాలపై దాడులు, దోపిడీలు పునరావృతం కాకుండా ఇటలీ అధికారులు భారీగా పోలీసులును, సైనికులను మోహరించారు. శనివారం మిలాన్, రోమ్, ట్యూరిస్ సహా పలు నగరాల్లో వేలాది మంది యువత ర్యాలీలు నిర్వహించారు. మిలాన్‌లో నిరసనలు ప్రశాంతంగా ముగియగా, రోమ్, ట్యూరిస్ నగరాల్లో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
మిలాన్‌లో వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. మరోవైపు సైనికులను మోహరించడంతోపాటు లగ్జరీ దుకాణాలకు అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. గతవారం హింసాత్మక ఘటనల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రధాని జార్జియా మెలోనీ అదనంగా 500 మంది సైనికులను మిలాన్‌కు పంపడంతోపాటు, మైనర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పలు నిర్ణయాలు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా మిలాన్‌లో పలువురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మీడియా తెలిపింది.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసనలకు అంతర్జాతీయంగా ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, శనివారం మిలాన్, రోమ్ నుంచి మాడ్రిడ్, లిస్బన్, టిరానా వరకు యూరప్‌లోని అనేక నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. విద్య, అవినీతి, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, పింఛన్లు, గృహవసతి వంటి సమస్యలపై ప్రజలు ఆందోళన చేపట్టారు.
రోమ్‌లో కొలోస్సియంలోకి చొరబడేందుకు యత్నం
ఇటలీ రాజధాని రోమ్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. విలాసవంతమైన దుకాణాలు ఉన్న వీధులను మూసివేశారు. కొంతమంది నిరసనకారులు ప్రసిద్ధ కొలోస్సియంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా సిబ్బంది వారిని బయటకు పంపించారు. మరోవైపు, తాము అల్లర్లకు పాల్పడే వాళ్లం కాదని స్పష్టంచేస్తూ వందలాది మంది విద్యార్థులు ప్రశాంతంగా నిరసన తెలిపారు.
అల్బేనియాలో ఘర్షణలు, ప్రభుత్వ భవనాలకు నిప్పు
అల్బేనియా రాజధాని టిరానాలో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. కొందరు నిరసనకారులు ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టడంతోపాటు పోలీసులపై వస్తువులు విసిరారు. శనివారం నగర వీధుల్లో భారీగా పోలీసులను మోహరించినట్టు అధికారులు తెలిపారు. వారం రోజులకుపైగా కొనసాగుతున్న ఆందోళనల్లో నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు, మంటలు రేపే వస్తువులు, పెట్రోల్ బాంబులు, బాణసంచా విసురుతున్నారు. దీనికి ప్రతిగా పోలీసులు లాఠీచార్జి, టియర్‌గ్యాస్‌ను ప్రయోగిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఫీజులు తగ్గించాలని, విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలని ఉన్నత పాఠశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యావ్యవస్థలో అవినీతిని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు.
పింఛన్లు, గృహ వసతిపై మాడ్రిడ్‌లో నిరసనలు
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో శనివారం వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు, ఇతరులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పింఛన్ల వ్యవస్థలో మార్పులు చేసి తమ ప్రయోజనాలు దెబ్బతీయొద్దని వారు డిమాండ్ చేశారు. పింఛన్లను ప్రైవేటీకరించే ప్రమాదం ఉన్నదని, వాటి ద్వారా లాభాలు పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని 68 ఏండ్ల మరియా జోస్ బెనెటో ఆందోళన వ్యక్తం చేశారు.వచ్చే నెలలో ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిరసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు స్పెయిన్‌లో గృహవసతి సమస్యపైనా నిరసనలు వెల్లువెత్తాయి. ఇండ్ల అద్దెలు, కొనుగోలు ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు వాటిని భరించలేని పరిస్థితి ఏర్పడింది.
లిస్బన్లోనూ అందుబాటు గృహాల కోసం ఆందోళన
స్పెయిన్‌లో జరుగుతున్న నిరసనల స్ఫూర్తితో పోర్చుగల్ రాజధాని లిస్బన్లోనూ శనివారం వేలాది మంది అందుబాటు ధరల్లో ఇళ్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోంటెనెగ్రో ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని చర్యలను నిరసనకారులు వ్యతిరేకిస్తున్నారు. ఏడాదికి అద్దె పెంపుపై ఉన్న పరిమితులను సడలించడం, అద్దె చెల్లించని వారిని ఇండ్ల నుంచి ఖాళీ చేయించడం సులభతరం చేయడం వంటి ప్రతిపాదనలు అందులో ఉన్నాయి. అయితే ఈ చర్యలు సమతుల్యంగా లేవని, అద్దెదారులను మరింత బలహీనమైన స్థితిలోకి నెడుతాయని నిరసనకారులు విమర్శిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

