male pregnancy | అనంత విశ్వం నుంచి మానవ కణనిర్మాణం వరకు సైన్స్ శోధించని అంశంలేదు. మనిషి పుట్టుక, జీవ పరిణామక్రమం, శరీర నిర్మాణం, ప్రకృతి ధర్మం తదితర అంశాల్లో ఇప్పటికే శాస్త్ర విజ్ఞానం ఎంతో ప్రగతి సాధించింది. ఇదే కోవలో సృష్టికి-ప్రతిసృష్టి చేసే కొత్త ప్రయోగాలకూ బాటలు పడుతున్నాయి. ఇందులో భాగంగా ‘ మగవారిలో గర్భధారణ ’ ప్రయోగాలకు చైనా శాస్త్రవేత్తలు అంకురార్పణ చేశారు. ప్రాథమికంగా ఎలుకల్లో చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది కూడా. అయితే, సృష్టిగమనానికి విరుద్ధంగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు.
చైనాలో షాంఘై నగరంలోని ఓ ప్రయోగశాలలో సిజేరియన్ ద్వారా ఓ మగ ఎలుక పది మంది పిల్లలకు జన్మనిచ్చింది. నావల్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు ‘ర్యాట్ మోడల్ 6’ పేరిట ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగంలో భాగంగా ఆరోగ్యంగా ఉన్న ఒక మగ, ఆడ ఎలుకను తీసుకున్నారు. వాటి చర్మాన్ని కత్తిరించి రెండింటి శరీర భాగాలకు ఉమ్మడిగా రక్తనాళాలను ఏర్పాటు చేశారు. తర్వాత మగ ఎలుక వృషణాలను తొలగించి.. దాని శరీరంలో గర్భసంచిని ప్రవేశపెట్టారు. అనంతరం రెండు ఎలుకల గర్భసంచిల్లోకి (వృషణాలు కత్తిరించిన ఎలుక, ఆడ ఎలుక) గర్భస్త పిండాల్ని చొప్పించారు. 21.5 రోజుల అనంతరం మగ, ఆడ ఎలుకల గర్భసంచిలో పరిపూర్ణంగా ఎదిగిన పిల్లలను గుర్తించారు. ముఖ్యంగా మగ ఎలుక గర్భసంచిలో పది ఎలుకలు ఎదగడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సిజేరియన్ ద్వారా బయటకు తీసిన ఈ ఎలుక పిల్లల పునరుత్పత్తి అవయవాలు, గుండె స్పందనలు, ఊపిరితిత్తులు, కాలేయం తదితర కీలక అవయవాల పనితీరు సరిగ్గా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. మనుషుల్లో కూడా ఈ ప్రయోగాలను త్వరలో చేపట్టనున్నట్టు వెల్లడించారు.
మగ జీవుల్లో గర్భధారణకు సంబంధించిన ప్రయోగాలను పలు దేశాలు ఇప్పటికే నిషేధించాయి. అయితే, చైనా గతకొన్ని సంవత్సరాలుగా దీనిపై ప్రయోగాలు చేస్తున్నది. తాజా ప్రయోగాలపై నిపుణులు మండిపడుతున్నారు. సృష్టిక్రమానికి విరుద్ధంగా ఈ ప్రయోగాలు జరుపడమేంటని ప్రశ్నిస్తున్నారు. చైనా చేపట్టిన తాజా ప్రయోగంలో మగ ఎలుక వృషాణాలను కత్తిరించి ప్రయోగం జరిపారని, అలాంటప్పుడు పిల్లలకు జన్మనిచ్చిన ఎలుకను ‘మగ’ ఎలుకగా ఎలా పరిగణిస్తారని యూనివర్సిటీ ఆఫ్ మకావు శాస్త్రవేత్త వేగే అన్నారు. ఆడ ఎలుక శరీరంలో ఉత్పత్తి అయిన హార్మోన్లు రక్తనాళాల ద్వారా మగ ఎలుకకు అందాయన్న విషయం మర్చిపోవద్దన్నారు. మరోవైపు, లింగమార్పిడి చేసుకున్న వారు పిల్లలకు జన్మనివ్వాలనుకుంటే ఈ ప్రయోగం ఒక ఆశాకిరణమని నావల్ మెడికల్ యూనివర్సిటీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
మగజీవులు పిల్లలకు జన్మనివ్వడం ఇప్పటికే ప్రకృతిలో ఉన్నది. సింగ్నాటిడే చేపలజాతికి చెందిన మగ సీ-హార్సెస్, సీ-డ్రాగన్లు, పైప్ ఫిష్లు గర్భందాల్చుతాయి. కాగా, అమెరికాకు చెందిన థామస్ ట్రేస్ బేటీ అనే మహిళ లింగమార్పిడి చేయించుకొని పురుషుడిగా మారారు. అనంతరం 2007లో కృత్రిమ గర్భధారణ విధానం ద్వారా గర్భందాల్చి ప్రపంచంలో గర్భందాల్చిన తొలి పురుషుడిగా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం అతనికి నలుగురు పిల్లలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?
Fertility problems | సంతానలేమికి కారణం?
Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?
male pregnancy | ఇక మగవారికీ గర్భం.. పది పిల్లలకు జన్మనిచ్చిన మగ ఎలుక