ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా కుప్పకూలిపోయే ఛాన్స్ ఉందని ఆయన మిత్ర పక్షం బాంబు పేల్చింది. ఇమ్రాన్‌కు మద్దతిచ్చే మూడు మిత్ర పక్షాలు కేబినెట్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు ప్రతిపక్షాలన్నీ కలిసి ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే కంటే ముందే ఇమ్రాన్ సర్కార్ చిక్కుల్లో పడినట్టైంది.
ఒకవేళ మిత్ర పక్షాలు గనక కేబినెట్ నుంచి వైదొలిగితే ప్రతిపక్షాలకు లాభం చేకూరుతుందని, అప్పుడు ఇమ్రాన్‌కు ఇబ్బందేనని ఇమ్రాన్ పార్టీకి మద్దతిస్తున్న పాక్ ముస్లిం లీగ్ ఖ్వాద్ అధ్యక్షుడు చౌధురీ పర్వేజ్ ఎలాహీ హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ వెంటనే మిత్రపక్షాలను కలుసుకోవాలని, వారితో సఖ్యతగా ఉంటూ, వారిని మెప్పిస్తేనే వారందరూ సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతారని, లేదంటే.. ఇమ్రాన్ సర్కార్ కుప్ప కూలడం ఖాయమని చౌధురీ పర్వేజ్ తీవ్రంగా హెచ్చరించారు.
గెలిచినా… ఓడినా ఇమ్రాన్‌కే లాభం : షేక్ రషీద్ అహ్మద్
అవిశ్వాసం ప్రవేశపెడితే విజయం, అపజయం అన్న వాటితో సంబంధం లేకుండా అంతిమంగా ప్రధాని ఇమ్రాన్‌కే లాభం చేకూరుతుందని పాక్ హోంమంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నారు. అవిశ్వాసం పెట్టినా… ఇమ్రాన్‌దే గెలుపని, గత మూడు వారాలుగా ఇమ్రాన్‌పై ప్రజల్లో తీవ్ర ప్రేమాభిమానాలు పెరిగాయని పేర్కొన్నారు. తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో అలజడులు సృష్టిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా వుంటాయని హోంమంత్రి తీవ్రంగా హెచ్చరించారు. పాక్‌లో అంతర్యుద్ధం సృష్టించడానికి విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని, దానికి తగ్గ ఫలితం కూడా అవి అనుభవించాల్సి వుంటుందని షేక్ రషీద్ అహ్మద్ హెచ్చరించారు.