వాషింగ్టన్, సెప్టెంబర్ 3: విమానాన్ని వాల్‌మార్ట్‌పై కూలుస్తానంటూ బెదిరిస్తూ అమెరికాలో ఓ పైలట్ దాదాపు మూడు గంటల పాటు తీవ్ర భయాందోళనలు సృష్టించాడు. ఈ ఘటన మిసిసిప్పి రాష్ట్రంలోని టుపెలో నగరంలో శనివారం చోటుచేసుకున్నది. పైలట్ బెదిరింపులతో పోలీసులు, ఇతర అధికారులు అప్రమత్తమై వాల్‌మార్ట్‌తో పాటు సమీపంలోని స్టోర్ల నుంచి సిబ్బంది, ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించారు.
ఉదయం 5 గంటల సమయంలో టుపెలో ఎయిర్‌పోర్టు నుంచి ఆ పైలట్ తొమ్మిది సీట్లు ఉండే చిన్న విమానాన్ని తీసుకుపోయాడని, మూడు గంటలకు పైగా గాలిలోనే చక్కర్లు కొట్టాడని పోలీసులు పేర్కొన్నారు. 8 గంటల తర్వాత పైలట్ విమానాన్ని బ్లూస్ప్రింగ్స్ నగరం సమీపంలో ల్యాండ్ చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.