వాషింగ్టన్: ఇరాన్ యుద్ధంలో అంతిమ చావు దెబ్బకు సంబంధించి ఓ కార్యాచరణ ప్రణాళికను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం (పెంటగాన్) రూపొందిస్తున్నట్లు ఆక్సియోస్ వెబ్సైట్ గురువారం వెల్లడించింది. వ్యూహాత్మక ద్వీపాలను స్వాధీనం చేసుకోవడం, భూతల దళాలను దింపడం, భారీస్థాయిలో బాంబుల వర్షం కురిపించడంతోసహా నాలుగు ప్రధాన ప్రత్యామ్నాయాలతో పెంటగాన్ ప్రణాళికను రూపొందిస్తున్నది. ఈ వారాంతంకల్లా దౌత్య చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోయినా, హొర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగినా సైనిక చర్యలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. పెంటగాన్ ప్రతిపాదిస్తున్న నాలుగు ప్రధాన ప్రత్యామ్నాయాలు హొర్ముజ్ జలసంధిపై నియంత్రణకు సంబంధించినవే.
వీటిలో ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం లేదా అడ్డగించడం కూడా ఒకటి. రెండో ప్రత్యామ్నాయం హొర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రించడానికి సాయపడుతున్న వ్యూహాత్మక ఔట్‌పోస్టు లారక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం. మూడో ప్రత్యామ్నాయం వ్యూహాత్మక అబూ మూసా ద్వీపం, మరో రెండు చిన్న ద్వీపాలను స్వాధీనం చేసుకోవడం. వీటిని ఇరాన్ నియంత్రిస్తున్నప్పటికీ అవి తమకు కూడా చెందుతాయన్నది యూఏఈ వాదన. నాలుగో ప్రత్యామ్నాయం హొర్ముజ్ జలసంధికి తూర్పు వైపు నుంచి ఎగుమతి అయ్యే ఇరాన్ చమురు నౌకలను అడ్డుకోవడం. వీటితోపాటు ఇరాన్‌లోకి లోతుగా చొచ్చుకువెళ్లి భూతల దాడులు చేయడంలో సాధ్యాసాధ్యాలను కూడా అమెరికా పరిశీలిస్తున్నది. అక్కడి అణు స్థావరాల్లో నిల్వచేసిన యురేనియంను స్వాధీనం చేసుకోవడం గురించి కూడా పెంటగాన్ యోచిస్తున్నది.