టొరంటో : ప్రతి నలుగురు మహిళల్లో ఒక మహిళ గృహ హింస బాధితురాలేనని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన వరల్డ్‌వైడ్ ఎనాలిసిస్ వెల్లడించింది. మెక్‌గిల్ యూనివర్సిటీ, డబ్ల్యూహెచ్ఓకు చెందిన పరిశోధకుల ఆధ్వర్యంలో 161 దేశాలకు చెందిన 20 లక్షల మందికి పైగా మహిళలను ప్రశ్నించిన మీదట ఈ వివరాలు వెలుగుచూశాయి. ప్రతి ఏడుగురు మహిళల్లో ఒక మహిళ తన భాగస్వామి నుంచి హింసను ఎదుర్కొంటోందని గుర్తించారు.
15 నుంచి 19 సంవత్సరాలలోపు యువతుల్లో 24 శాతం మంది తమ జీవితకాలంలో అధికంగా గృహ హింసను అనుభవించినట్టు వెల్లడైంది. వాస్తవంగా మహిళలపై హింస ఇంకా అధికంగా ఉంటుందని మెక్‌గిల్ వర్సిటీ, డబ్ల్యూహెచ్ఓ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు తమకు ఎదురైన అనుభవాలను చెప్పడం ద్వారా ఈ విషయాలు వెలుగుచూశాయని చాలా మంది ఇటువంటి ఘటనలను బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడరని వారి సంఖ్య ఇంకా అధికంగా ఉంటుందని అంచనా వేశారు.
మహిళలపై శారీరకంగా, లైంగికంగా భర్తలు, బాయ్‌ఫ్రెండ్స్, ఇతర భాగస్వాముల ఆగడాలు ప్రపంచవ్యాప్తంగా అధికంగా నమోదవుతున్నాయని మెక్‌గిల్ వర్సిటీకి చెందిన మాధ్యూ మహీ గిరక్స్ చెప్పుకొచ్చారు. అధికాదాయ దేశాల్లో మహిళలపై హింస తక్కువ మోతాదులో వెలుగుచూసిందని, ప్రాంతాల వారీగానూ వ్యత్యాసాలను గుర్తించామని తెలిపారు.