అంతుచిక్కని కాలేయ వ్యాధి అమెరికా, యూకేలోని చిన్నారులను భయపెడుతున్నది. వ్యాధి సోకిన గంటల వ్యవధిలోనే పిల్లలు కుప్పకూలిపోతున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు తాత్కాలికంగా చికిత్స అందిస్తున్నప్పటికీ, ఈ వ్యాధి ఏమిటి? దీని వెనకున్న కారణాలపై ఒక కచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు.
గత ఏడాది అక్టోబర్లో అమెరికాలోని అలబామాలో 9 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వీరి వయసు 1-6 ఏండ్లు మాత్రమే. బాధిత చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. వాపు కారణంగా కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. 3 నెలల తర్వాత యూకేలోని ప్రధాన నగరాల్లో 74 మంది పిల్లలకు మళ్లీ అలాంటి సమస్యే ఎదురైంది. తాజాగా మరో 3 దేశాల్లో కూడా పదుల సంఖ్యలో ఇదే తరహా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మిస్టరీ వ్యాధికి గల కారణాలను తేల్చేపనిలో పడ్డారు నిపుణులు. బాధిత చిన్నారులను రక్షించడానికి ప్రస్తుతం కాలేయమార్పిడి చికిత్సలు చేస్తున్నారు.
బాధిత చిన్నారుల కాలేయంలో అనూహ్యంగా వాపు రావడంతో హెపటైటిస్ వైరస్లు (ఏ,బీ,సీ,డీ,ఈ) ఈ వ్యాధికి కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తొలుత భావించింది. పరిశోధనల్లో ఇది నిర్ధారణ కాలేదు. జలుబు, జ్వరాన్ని కలిగించే ఎడినోవైరస్, కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కొవ్-2 వైరస్ చిన్నారుల శరీరంలో ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. చిన్నారుల్లో హెపటైటిస్, ఎడినోవైరస్ 41ను గుర్తించినట్టు అలబామా వైద్య విభాగం తెలిపింది. ఈ వ్యాధి ఏమిటన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని డబ్ల్యూహెచ్వో నిపుణులు చెబుతున్నారు.
అమెరికా, యూకే, స్పెయిన్, డెన్మార్క్, నెదర్లాండ్స్
దురద, కండ్లు, చర్మం పసుపు పచ్చగా మారడం, విపరీతమైన జ్వరం, శ్వాసలో ఇబ్బంది, కీళ్లు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, మూత్రం పచ్చగా, మలం బూడిద రంగులో వెళ్లడం
రోగులు తాకిన ప్రదేశాలను తాకి.. అదే చేతులతో కండ్లు, ముక్కు, నోటిని తాకడం, తుమ్ము, దగ్గడం ద్వారా..