అమ్మాన్: జోర్డాన్ పార్లమెంట్లో మంగళవారం కొందరు ఎంపీలు కొట్టుకున్నారు. రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వివాదం చెలరేగింది. రెండు గ్రూపులుగా మారిన ఎంపీలు.. బాహాబాహీకి దిగారు. ఆ తర్వాత తీవ్ర స్థాయిలో దూషణలు చేసుకున్నారు. దిగువ సభలో ఈ ఘటన జరిగింది. హౌజ్ స్పీకర్ అబ్దుల్ కరీమ్ దుగ్మీ, డిప్యూటీ సులేమాన్ అబూ యాయా మద్య మాటల యుద్ధం సాగింది. హౌజ్ స్పీకర్ అబ్దుల్‌కు సభను నడిపించడం రాదంటూ సులేమాన్ కామెంట్ చేశారు. దీంతో ఎంపీలు ఒకరి గల్లాను ఒకరు పట్టుకుని ముష్టిఘాతానికి దిగారు. దీంతో స్పీకర్ సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. రాజ్యాంగంలోని రెండవ చాప్టర్లో ఉన్న జోర్డానియన్ల విధులు, హక్కుల అంశానికి మహిళా జోర్డానియన్లు అన్న కొత్త పదాన్ని కలిపారు. అయితే ఫిమేల్ జోర్డానియన్లు అన్న పదాన్ని తొలగించాలంటూ కొందరు ఎంపీలు డిమాండ్ చేశారు. ఇది లింగ వివక్షకు దారి తీస్తుందని ఆరోపించారు. దీంతో ఎంపీలు రెండు వర్గాలుగా మారి వాగ్వాదానికి దిగారు.