తనకు కాబోయే భార్య పరీక్షల్లో ఫెయిలవుతుందని తెలిసిన ఒక వ్యక్తి.. ఏకంగా ఆమె చదివే కాలేజికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన ఈజిప్టులో వెలుగు చూసింది. సదరు యువకుడి వయసు 21 సంవత్సరాలు. అతనికి కాబోయే భార్య చదువు పూర్తయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటానంది. దీనికి అతను సరేనన్నాడు. అయితే ఈ ఏడాది పరీక్షల్లో ఆమె కచ్చితంగా ఫెయిల్ అవుతుందని ఆ యువకుడికి తెలిసింది. ఇప్పుడు మరో ఏడాది పాటు పెళ్లి కోసం వెయిట్ చేయాలని తెలియడంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు.
ఈ క్రమంలోనే తనకు కాబోయే భార్య చదివే కాలేజికి నిప్పుపెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి తన స్వగ్రామం సమీపంలో దాక్కున్నాడు. అయితే కాలేజికి నిప్పుపెట్టే సమయంలో అతన్ని చూసిన కొందరు.. ఆ యువకుడు ఎక్కడ ఉంది? ఎలా ఉండేది పోలీసులకు వివరించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన తప్పును ఆ యువకుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ మంటల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ప్రిన్సిపాల్ ఆఫీస్ తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.