తైపీ : పెయిడ్ లీవ్ కోసం తైవాన్ వ్యక్తి 37 రోజుల వ్యవధిలో ఒకే మహిళను నాలుగు సార్లు పెండ్లి చేసుకుని మూడు సార్లు ఆమెకు విడాకులు ఇచ్చాడు. తైపీలోని ఓ బ్యాంకులో పనిచేసే వ్యక్తి మొదటి పెండ్లికి బ్యాంక్ తొలుత ఎనిమిది రోజుల సెలవు మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్ 6న పెండ్లి చేసుకున్న అతడు వెడ్డింగ్ లీవ్ ముగియగానే మరో పెయిడ్ లీవ్ కోసం ఆమెకు విడాకులు ఇచ్చి మరుసటి రోజే తిరిగి మొదటి భార్యనే పెండ్లి చేసుకున్నాడు. ఇక ఇదే తరహాలో 32 రోజుల్లో ఆమెకు మూడు సార్లు విడాకులు ఇచ్చి నాలుగుసార్లు పెండ్లి చేసుకున్నాడు. అయితే పెయిడ్ లీవ్ కోసం అతడి నిర్వాకాన్ని పసిగట్టిన బ్యాంక్ అదనపు పెయిడ్ లీవ్స్ ను మంజూరు చేసేందుకు నిరాకరించింది.
అదనపు పెయిడ్ లీవ్స్ కు బ్యాంక్ నిరాకరించినా తన ప్లాన్ ప్రకారం క్లర్క్ అదే మహిళతో మూడు సార్లు తెగదెంపులు చేసుకుని నాలుగు సార్లు వివాహం చే\సుకున్నాడు. ఆపై తైపీ లేబర్ బ్యూరోలో బ్యాంక్ యజమానిపై లేబర్ నిబంధనలను ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశాడు. అక్కడి చట్టాల ప్రకారం ఉద్యోగుల వివాహానికి ఎనిమిది రోజుల పెయిడ్ లీవ్ మంజూరు చేస్తారు. క్లర్క్ నాలుగు సార్లు పెండ్లి చేసుకోవడంతో అతడు 32 రోజుల పెయిడ్ లీవ్ లభించాలి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన తైపీ సిటీ లేబర్ కోర్ట్ బ్యాంక్ యాజమాన్యం కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిదని పేర్కొంటూ గత ఏడాది అక్టోబర్ లో రూ 52,800 జరిమానా విధించింది. అయితే ఉద్యోగి పెయిడ్ లీవ్ కోసం అడ్డదారి తొక్కడం కార్మిక సెలవు నిబంధనల కింద సరైన కారణం కాదని బ్యాంక్ అప్పీల్ లో పేర్కొంది.