బెర్లిన్: జర్మనీలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సును ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో సందేశం చేశారు. ఏ దశలోనూ రష్యాపై వత్తిళ్లను తగ్గించవద్దు అన్నారు. ఆ దేశంపై భారీ చర్యలకు పూనుకోవాలని జీ7 దేశాలను జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్‌కు భారీ ఆయుధాలను సరఫరా చేయాలని, ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ను కూడా తమకు అందించాలని కోరారు. రష్యా జరుపుతున్న వరుస మిస్సైల్ దాడులను అడ్డుకునేందుకు కొత్త ఆయుధాలు అవసరం అన్నారు. ఈ ఏడాది చివర లోగా యుద్ధాన్ని ఆపాలని భావిస్తున్నట్లు చెప్పారు. శీతాకాలం ప్రవేశించకముందే యుద్ధం ఆగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయుధాలను మరింత విస్తృతంగా సరఫరా చేయనున్నట్లు జీ7 దేశాలు హామీ ఇచ్చాయి. కొన్ని దేశాలు రష్యా బంగారం దిగుమతులపై నిషేధం విధించాయి. పుతిన్‌పై జీ7 వత్తిడి కొనసాగిస్తుందని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కల్జ్ తెలిపారు.