Iran vs US : ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. అమెరికా విధించిన గడువు సమీపిస్తున్న వేళ.. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. మా ‘రెడ్ లైన్స్’ దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని, మా స్పందన మధ్యప్రాచ్యం దాటి విస్తరిస్తుందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హెచ్చరించింది.
ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతోపాటు డ్రోన్లతో దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. సౌదీ అరేబియాలోని రెండు అమెరికన్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లపై, ఇజ్రాయెల్ సైనిక సామగ్రి రవాణా చేస్తున్న ఓడపై కూడా కచ్చితమైన దాడులు చేశామని తెలిపింది. పౌర లక్ష్యాలపై తాము దాడి చేయబోమని, కానీ తమ పౌర సదుపాయాలపై దాడులు జరిగితే మాత్రం వెనక్కి తగ్గేది లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చిచెప్పింది.
మధ్యప్రాచ్య ప్రాంతంలోని ఆయిల్, గ్యాస్ సౌకర్యాలను సంవత్సరాల తరబడి పనిచేయకుండా నాశనం చేయగలమని కూడా ఇరాన్ బెదిరించింది. అమెరికా మిత్రదేశాల విషయంలో ఇప్పటివరకు తాము సంయమనం పాటించామని, ఇకపై ఆ నియంత్రణలు ఉండవని స్పష్టంచేసింది.