Hezbollah | బీరుట్, సెప్టెంబర్ 30: ఎడాపెడా దాడులతో ఇజ్రాయెల్ ఊపిరి సలపనీయకుండా చేస్తున్నప్పటికీ లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా మాత్రం తాము వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నది. ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాతో పాటు పలువురు కమాండర్లు ఇటీవల దాడుల్లో మరణించారు. అయినప్పటికీ తాము ఇజ్రాయెల్‌తో పోరాడుతూనే ఉంటామని హెజ్బొల్లా తాత్కాలిక నేతగా వ్యవహరిస్తున్న నయీమ్ కాసీమ్ సోమవారం ప్రతిజ్ఞ చేశారు. పదాతి దళాలతో దాడి చేయడానికి ఇజ్రాయెల్ కనుక వస్తే దానిని ఎదుర్కోడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. దాడుల్లో కమాండర్లు గాయపడినా, మరణించినా, వారి స్థానాలను డిప్యూటీ కమాండర్లతో వెంటనే భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుందని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు.
లెబనాన్ టాప్ కమాండర్ కుటుంబం మృతి
లెబనాన్ రాజధాని బీరుట్ నగరంలోని ఓ నివాస భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరోవైపు దక్షిణ పోర్టు నగరమైన టైర్‌లోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో లెబనాన్ టాప్ కమాండర్ ఫతే షరీఫ్ అబు ఎల్-అమీన్, అతని భార్య, కుమారుడు, కుమార్తె మరణించినట్టు హమాస్ ప్రకటించింది. వీరే కాక ముగ్గురు మిలిటెంట్లు కూడా మరణించారు.
పేజర్ పేలుళ్లలో కేరళ వాసిపై ఇంటర్నేషనల్ వారెంట్
ఇటీవల లెబనాన్‌లో వాకీటాకీలు, పేజర్లు పేలడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసుకు సంబంధించి కేరళలో జన్మించిన నార్వే వ్యాపారవేత్త రిన్సోన్ జోస్ పేరు విన్పిస్తున్నది. బల్గేరియా కేంద్రంగా పనిచేసే ఇతని సంస్థ ద్వారానే లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూప్‌నకు పేజర్లు సరఫరా అయినట్టు నిర్ధారణ కావడంతో ఆయనపై అంతర్జాతీయ వారెంట్ జారీ అయ్యింది. నోర్తా గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ ఈ పేజర్ల డీల్ వెనుక ఉందని హంగేరియన్ మీడియా వెల్లడించింది. దీనిని జోస్ 2022లో స్థాపించారు.