మాస్కో, డిసెంబర్ 25: పెద్ద కంపెనీల్లో ఉద్యోగం మానేసి రష్యాలో మన దేశానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు చీపురు చేతబట్టి రోడ్లు ఊడుస్తున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం కన్నా క్లీనర్‌గా చేస్తేనే ఎక్కువ జీతం వస్తున్నదని, అందుకే పని ఏదైతేనేం.. పైసలు ముఖ్యం అని వారు తెగేసి చెబుతున్నారు. రష్యాలో క్లీనర్ ఉద్యోగాలకు భారీగా కొరత ఉండటంతో పుతిన్ సర్కారు భారీగా వేతనాలు అందిస్తున్నది.
వీధుల్లో చీపురుతో ఊడుస్తూ కన్పించిన 26 ఏండ్ల ముఖేశ్ మండల్‌ను మీడియా ప్రశ్నించగా, మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న తాను ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వీపర్‌గా చేరానని తెలిపాడు. ఎందుకంటే స్వీపర్‌గా తనకు నెలకు రూ.1.1 లక్షల జీతం వస్తున్నదని, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తుండటంతో తన జీతమంతా మిగిలిపోతున్నదని తెలిపాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం కన్నా ఇది ఎక్కువని పేర్కొన్నాడు. తనతో పాటు భారత్ నుంచి వచ్చిన 19-43 ఏండ్ల వయసు గల 17 మంది కూడా ఇక్కడ క్లీనర్లుగానే పనిచేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.