దుబాయ్, మే 22: దుబాయ్‌కి చెందిన ఓ స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేసింది. ప్రవాస భారతీయులతోసహా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు కోట్లలో నష్టపోయారు. దుబాయ్‌లోని గోల్డెన్ టవర్‌లో కార్యకలాపాలు సాగించిన గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయాలను రాత్రికి రాత్రే ఖాళీ చేసి నిర్వాహకులు పరారయ్యారు. ఫోరెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించి ఇన్వెస్టర్లను నిలువునా ముంచి పరారైన నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గోల్డెన్ టవర్లోని 302, 305 సూట్స్‌లో గత నెల వరకు దాదాపు 40 మంది సిబ్బందితో జోరుగా కార్యకలాపాలు సాగాయి. ఆఫీసులను పూర్తిగా ఖాళీ చేసిన నిర్వాహకులు హడావుడిగా తాళాలు ఇచ్చి వెళ్లిపోయారని సెక్యూరిటీ గార్డు ఖలీజ్ టైమ్స్ దినపత్రికకు తెలియచేశాడు. ఇప్పుడు రోజూ బాధితులు వచ్చి పారిపోయిన వ్యక్తుల గురించి వాకబు చేస్తున్నారని అతను చెప్పాడు. పెట్టుబడి పెట్టి నష్టపోయిన బాధితుల్లో కేరళ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మొహమ్మద్, ఫయాజ్ పొయిల్ ఉన్నారు.
వీరిద్దరూ గల్ఫ్ ఫస్ట్‌లో 75,000 డాలర్లు(దాదాపు రూ. 65 లక్షలు) పెట్టుబడి పెట్టి మోసపోయారు. తాను సమాధానాల కోసం ఇక్కడకు వచ్చానని, కానీ ఇక్కడ ఖాళీ ఆఫీసులు తప్ప ఏమీ లేదని ఫయాజ్ చెప్పారు. అన్ని ఫోన్ నంబర్లకు కాల్ చేశానని, కానీ ఎవరూ స్పందించడం లేదని ఆయన తెలిపారు. తన మాతృభాష కన్నడంలో మాట్లాడిన రిలేషన్షిప్ మేనేజర్ మాయమాటలు నమ్మి 2.30 లక్షల డాలర్లు(రూ. 1.98 కోట్లు) పెట్టుబడి పెట్టి పూర్తిగా నష్టపోయానని మరో భారతీయ బాధితుడు వాపోయారు.