జెనీవా, మార్చి 20: ప్రపంచంలో సంతోషకర దేశాల జాబితాలో భారత్ 125వ స్థానంలో నిలిచింది. మన కంటే పొరుగు దేశాలు నేపాల్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ జాబితాలో ముందున్నాయి. 150 దేశాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఐక్యరాజ్యసమితి సైస్టెనబుల్ డెవెలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు’ పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది.
జీడీపీ పర్ క్యాపిటా, సామాజిక మద్దతు, ఆరోగ్యకర జీవన కాలపు అంచనా, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని తయారుచేసిన ఈ జాబితాను ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే సందర్భంగా సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఫిన్‌ల్యాండ్ వరుసగా ఆరోసారి మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో డెన్మార్క్, మూడోస్థానంలో ఐస్‌ల్యాండ్ నిలిచాయి. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ర్యాంకుల్లో రష్యా, ఉక్రెయిన్ దిగజారినా రష్యా 72, ఉక్రెయిన్ 92వ స్థానంలో నిలిచాయి.