Fire Accident : అల్జీరియా (Algeria) రాజధాని అల్జీర్స్ (Algiers) లోని ఓ ఫోస్టర్ కేర్ హోమ్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. మరో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫోస్టర్ కేర్ హోమ్ అంటే తల్లిదండ్రుల సంరక్షణ లేని పిల్లలకు తాత్కాలికంగా సంరక్షణ అందించే సంస్థ. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వాహకుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) మంటలు ఆర్పేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటలకుపైగా మంటలు అదుపుచేసే ప్రయత్నాలు చేశారు.
ఈ మంటలు అర్పేందుకు 10 ఫైరింజన్లను వినియోగించారు. బాధితులను రక్షించేందుకు 16 అంబులెన్సులను ఘటన స్థలంలో అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. కాగా అల్జీరియాలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల కారణంగా వ్యవధిలో దాదాపు 1,000 అగ్నిప్రమాదాలు నమోదైనట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అల్జీరియా ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధానమంత్రి సిఫీ ఘ్రియెబ్ గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించేందుకు అల్జీర్స్‌లోని రెండు ఆసుపత్రులకు వెళ్లారు.