ఫ్లోరిడా: ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ ప్రయోగించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అయనోస్పియర్(Ionosphere)లో రంధ్రం పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జూలై 19వ తేదీన కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఆ రాకెట్‌ను ప్రయోగించారు. టూ స్టేజ్ ఇంజిన్‌కు చెందిన ఆ రాకెట్‌ను మళ్లీ వాడే విధంగా తయారు చేశారు. భూకక్ష్యలోకి పేలోడ్స్‌తో పాటు వ్యోమగాముల్ని తీసుకువెళ్లే లక్ష్యంతో ఫాల్కన్ 9 రాకెట్‌ను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు ఫాల్కన్ రాకెట్ ద్వారా 240 ప్రయోగాలు చేపట్టారు. 198 ల్యాండింగ్స్‌ను కూడా నిర్వహించారు. జూలై 19వ తేదీన జరిగిన పరీక్ష వల్ల ఆకాశంలోని అయనోస్పియర్‌లో పలుచటి ఎరుపు రంగు రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు. బోస్టన్ యూనివర్సిటీకి చెందిన అంతరిక్ష ఖగోళ శాస్త్రవేత్త జెఫ్ బౌమ్గార్డెనర్ ఆ రంధ్రాన్ని అధ్యయనం చేశారు. అయితే అయనోస్పియర్‌కు రంథ్రం పడినట్లు స్టడీ తర్వాత శాస్త్రవేత్తలు తేల్చారు. భూమికి 200 లేదా 300 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ ఇంజిన్లు మండడం వల్ల ఎరుపు రంగు రంథ్రాలు ఏర్పడనున్నట్లు బౌమ్గార్డెనర్ తెలిపారు.
జూలై 19వ తేదీన జరిగిన పరీక్ష సమయంలో.. సుమారు 286 కిలోమీటర్ల ఎత్తులో ఫాల్కన్ రాకెట్ మండిందని, దాని వల్ల అయనోస్పియర్‌లో రంధ్రం కనిపించి ఉంటుందని ఆయన అన్నారు. అయనోస్పియర్‌లో అయాన్లు ఉంటాయని నాసా చెబుతోంది. ఆ అయాన్లలో ఉండే అయస్కాంత శక్తి వల్లే ఆకాశంలో అద్భుతమైన హరివిల్లు ఏర్పడుతుందన్నారు.