న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల నుంచి సేవలు నిలిచిపోయాయి. వాటికి సంబంధించిన వెబ్సైట్లు, యాప్లు ఓపెన్ కాలేదు. దీంతో వినియోగదారులు బాగా ఇబ్బంది పడ్డారు. సేవల్లో లోపానికి గల కారణాలను ఫేస్బుక్ వెల్లడించలేదు. రాత్రి 12 గంటల వరకు సేవలు అందుబాటులోకి రాలేదు. అంతరాయం కలిగినందుకు ఫేస్బుక్ క్షమాపణలు తెలిపింది. సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. సాంకేతిక లోపాల కారణంగా సమస్య తలెత్తినట్టు తెలిసింది.